Reading Time: < 1 minute
మమత బెనర్జీకి బిగ్ షాక్..! TMC పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం..!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై మమతా బెనర్జీ, రీటాబ్రత బెనర్జీ వర్గాలు పోటీగా హక్కులు కోరుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం మధ్యంతర నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రెండు వర్గాలూ TMC పేరు, అధికారిక ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా ఆంక్షలు విధించింది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు తమ అభ్యర్థులను బరిలోకి దించడంతో పార్టీ పేరు, గుర్తు అంశం అత్యంత కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు శుక్రవారం (సెప్టెంబర్ 18) ఉదయం 11 గంటల్లోపు తమకు కావాల్సిన కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి చెరో మూడు ఎంపికలను సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎంపికల్లో నుంచి ఎన్నికల సంఘం ఒక పేరు, గుర్తును కేటాయించే అవకాశం ఉంది.

గురువారం (సెప్టెంబర్ 17) ఈసీ ఇరు వర్గాలతో వేర్వేరుగా సమావేశమై వారి వాదనలు, పత్రాలను పరిశీలించింది. రీటాబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం తరఫున రీటాబ్రతతో పాటు చంద్రమా భట్టాచార్య, అక్రుల్ జమాన్, అరూప్ రాయ్ తదితరులు హాజరయ్యారు. పార్టీపై తమ హక్కుకు సంబంధించిన వాదనలు, ప్రశ్నలకు సమాధానాలను కమిషన్ ముందు ఉంచినట్లు రీటాబ్రత తెలిపారు. అనంతరం మమతా బెనర్జీ వర్గం తరఫున డెరెక్ ఓబ్రెయిన్, కల్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా, సాగరిక ఘోష్ తదితరులు ఈసీని కలిశారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని, ప్రస్తుత పార్టీ గుర్తుపై ఆంక్షలు విధించడాన్ని వారు వ్యతిరేకించినట్లు సమాచారం.

ఇరు వర్గాల వాదనలు, పత్రాలను పరిశీలించిన అనంతరం ఉప ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా పార్టీ పేరు, గుర్తును నిలిపివేయాలని ఈసీ నిర్ణయించింది. తదుపరి విచారణలో పార్టీపై సంస్థాగత నియంత్రణకు సంబంధించి ఇరు వర్గాల వాదనలను పరిశీలించనుంది. ప్రస్తుతం మాత్రం అక్టోబర్ 6 ఉప ఎన్నికల్లో రెండు వర్గాలు TMC పేరుతో, అధికారిక గుర్తుతో పోటీ చేసే అవకాశం ఉండదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..