
అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన హోవార్డ్ కిర్బీ అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ షాప్‌లో 50 డాలర్లకు (రూ. 4,000 పైగా) ఒక పాత సోఫాను కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దాని కుషన్ అసౌకర్యంగా అనిపించడంతో, ఆయన కోడలు కుషన్ జిప్‌ను తెరిచి చూసింది. అందులో ఊహించని విధంగా 43,170 డాలర్లు (సుమారు రూ. 36 లక్షల నగదు) ఉన్న పెట్టె బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
హోవార్డ్ కిర్బీ ఒవోస్సోలోని బిటాట్ ఫర్ హ్యుమానిటీ రీస్టోర్ అనే పాత వస్తువుల విక్రయశాల నుండి కేవలం 50 డాలర్లకు (సుమారు రూ. 4,000) ఒక పాత సోఫాను, దానితో పాటు ఉండే కూర్చునే కుషన్ సీటును కొనుగోలు చేశాడు. కొద్ది వారాల పాటు దానిని ఉపయోగించిన తర్వాత, ఆ సీటులో కూర్చోవడం కొద్దిగా అసౌకర్యంగా అనిపించింది. దాంతో దాని లోపల ఏముందో చూడాలని కిర్బీ కోడలు కుషన్ జిప్‌ను తెరిచింది. లోపల కట్టలుగా అమర్చి ఉన్న నోట్ల కట్టల పెట్టెను చూసి ఆమె తీవ్ర ఆశ్చర్యానికి గురైంది. ఆ డబ్బును లెక్కించగా ఏకంగా 43,170 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 36 లక్షలకు పైగా) ఉంది.
ఇంత పెద్దమొత్తంలో డబ్బు లభించడంతో కిర్బీ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. నిజానికి కిర్బీకి తన ఇంటి కప్పు ను బాగు చేయించుకోవడానికి డబ్బు అత్యంత అవసరంగా ఉంది. పైగా, కొనుగోలు చేసిన వస్తువులో దొరికిన డబ్బును చట్టపరంగా ఆయనే ఉంచుకోవచ్చని న్యాయవాదులు కూడా చెప్పారు. కానీ, కిర్బీ మనస్సాక్షి దానికి అంగీకరించలేదు. వేరొకరి కష్టార్జితాన్ని తనదిగా అనుకోవడం ఆయనకు నచ్చలేదు.
బాధ్యతాయుతంగా ప్రవర్తించిన కిర్బీ వెంటనే సోఫా అమ్మిన షాపు నిర్వాహకులను సంప్రదించి, ఆ సోఫా అసలు యజమాని వివరాలు సేకరించాడు. ఆ సోఫా ఫిలిప్ ఫౌత్ అనే వ్యక్తికి చెందినదిగా తెలిసింది. ఆయన మరణించిన తర్వాత, మనవరాలు కిమ్ ఫౌత్-న్యూబెర్రీ ఆ సోఫాలో దాచిన డబ్బు గురించి తెలియక సెకండ్ హ్యాండ్ షాప్‌నకు విరాళంగా ఇచ్చేసింది.
కిర్బీ ఆమెను పిలిపించి, కుషన్‌లో దొరికిన రూ. 36 లక్షల నగదును పైసా తగ్గకుండా తిరిగి అప్పగించాడు. కిర్బీ చేసిన ఈ ఉదారత్వానికి, నిజాయితీకి ఆ కుటుంబంతో పాటు స్థానికులు, సోషల్ మీడియా నెటిజన్లు నీరాజనాలు పలికారు. “నేను సరైన నిర్ణయం తీసుకున్నందుకు నా మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంది” అని కిర్బీ ఆనందంగా వెల్లడించాడు.