
చండీఘర్: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు కళ్యాణ్ బైన్స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని దౌసాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 48 గంటలుగా పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పట్టుకున్నారు.
ఆదివారం (సెప్టెంబర్ 13) గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై సియా అనే మహిళా బైకర్ ఇతర బైకర్ల బృందంతో కలిసి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమెను ఓ కారు ఢీకొట్టింది. దీంతో సియా బైక్ పైనుంచి ఎగిరిపడి రోడ్డుపై స్కిడ్ అయ్యింది. అయితే, ఉద్దేశపూర్వకంగానే కారు డ్రైవర్ తనను ఢీకొట్టాడని సియా ఆరోపించింది.
చాలా దూరం నుంచి తనను ఫాలో అవుతున్నారని.. కారును కొంచెం దూరం పాటించాలని కోరారని చెప్పింది. ఈ క్రమంలోనే తనను కారుతో వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయారని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు యాక్షన్ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సియా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కళ్యాన్ బైన్ల్సాగా గుర్తించారు. అయితే, నిందితుడిపై హత్యాయత్నం సెక్షన్ కూడా పెట్టాలని సియా ఫ్యామిలీ డిమాండ్ చేసింది. సాక్ష్యాలను పరిశీలించిన పోలీసులు సియా కుటుంబ అభ్యర్థన మేరకు నిందితుడిపై హత్యాయత్నం అభియోగాలు మోపారు.
పరారీలో ఉన్న నిందితుడిని రాజస్థాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. సియాను కావాలనే కారుతో ఢీకొట్టాననే ఆరోపణలను కళ్యాణ్ బైన్ల్సా ఖండించారు. సియా పదే పదే బైక్ వేగం మారుస్తూ కారుకు అడ్డంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నాడు.