Reading Time: 2 minutes
Komatireddy Venkat Reddy Ktr Kcr Farmhouse Assigned Lands Remarks

నల్లగొండ జిల్లా వేదికగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొత్తు దోచుకోవడం తప్ప మరొకటి తెలియదని మండిపడ్డారు. ఇటీవల శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల భూ బాగోతాలను సర్వే నంబర్లతో సహా ఆధారాలతో బయటపెట్టారని, ఆ వివరాలు వింటే అందరి కళ్లు తిరిగే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

వందల ఎకరాల ఆస్తులు ఎలా వచ్చాయి?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏకంగా 600 ఎకరాల భూమి ఉంటే, ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావులకు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో పేద దళితులకు చెందిన ఎస్సీ భూములు, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు. మంత్రి కాకముందు కేవలం బైక్, బస్సుల్లో తిరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఈ రోజు కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సొంతంగా కేవలం మూడు ఎకరాల భూమి మాత్రమే ఉందని, తాను సంపాదించుకున్నదంతా ప్రజల ప్రేమాభిమానాలేనని తెలిపారు. యూత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే తాను బెంజ్ కారులో తిరిగానని, పదవిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ వాహనం వాడతానని స్పష్టం చేశారు.

పోతిరెడ్డిపాడును జగన్‌కు రాసిచ్చిన కేసీఆర్

తెలంగాణ నీటి హక్కులను పక్కనబెట్టి సొంత తాత జాగీరులాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను అప్పటి ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్ రాసిచ్చారని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన ఈ చారిత్రక ద్రోహాన్ని గ్రహించినందుకే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని 36 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీని 30 స్థానాల్లో ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు, పేదలకు ఏనాడూ సహాయం చేయని నేతలు, ఇప్పుడు ప్రజల మధ్య తిరిగినా ప్రయోజనం ఉండదన్నారు.

పాదయాత్ర చేసినా బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మరు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే రోజుల్లో పాదయాత్ర కాదు కదా పోర్లు దండాల యాత్ర చేసినా ప్రజలు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని ఎంతమాత్రం నమ్మరని ఎద్దేవా చేశారు. నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు కదా అని ఇతరులు మాట్లాడే ఇంగ్లీష్‌ను తప్పుపడితే సరిపోదని వ్యాఖ్యానించారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని నైజం ఉన్న బీఆర్ఎస్ నేతలు, నకిలీ సానుభూతితో ప్రజల్లోకి వస్తే పుట్టగతులు ఉండవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.