Reading Time: 2 minutes
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా బలంగా నిర్మించిన డెంటిస్ట్ హోం టూర్ వైరల్‌..

ఈ రోజుల్లో సొంతిల్లు నిర్మించుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. సిమెంట్, ఇటుకలు, ఇనుము ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, బంగ్లాదేశ్‌కు చెందిన ఒక వైద్యుడు పర్యావరణహితమైన సరికొత్త ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించవచ్చని నిరూపిస్తూ.. వేలాది ప్లాస్టిక్ బాటిళ్లతో ఒక అందమైన ఆశియాటాని నిర్మించారు.

యూట్యూబ్ ఐడియా నుంచి రియల్ హోమ్ వరకు:

బంగ్లాదేశ్‌లోని బరిశాల్ జిల్లా రాజీహార్ గ్రామానికి చెందిన పలాష్ చంద్ర బరాయ్ వృత్తిరిత్య డెంటిస్ట్. పర్యావరణానికి హాని కలిగిస్తున్న పలాస్టిక్ వ్యర్థాలను ఏదైనా మంచి పనికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆయన పరిశోధనలు ప్రారంభించారు. ఒకరోజు యూట్యూబ్‌లో ప్లాస్టిక్ బాటిళ్ల నిర్మాణాల గురించి చూసిన ఆయన, దాన్ని స్వయంగా పరిశీలించేందుకు మదారీపూర్ ప్రాంతంలోని ఒక కట్టడాన్ని సందర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాక తన సొంత ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు.

Plastic Bottle House

నిర్మాణ ప్రక్రియ, ఖర్చు:

ఈ బాటిల్ హౌస్ నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగం.. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లలో ఎండిన ఇసుకను గట్టిగా నింపడం. ఇలా ఇసుక నింపిన బాటిళ్లు ఇటుకల కంటే బలంగా మారతాయి. ఆ బాటిళ్లను వరుసగా పేర్చి సిమెంట్, ఇసుక మిశ్రమంతో గోడలను నిర్మించారు.

వైశాల్యం: 140 చదరపు మీటర్లు (సుమారు 1,512 చదరపు అడుగులు)

ఎత్తు: 5.5 మీటర్లు

మొత్తం ఖర్చు: 6 లక్షల టాకాలు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 4.5 లక్షలు)

బయటి నుంచి చూస్తే ఈ ఇంట్లో వేలాది ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయని ఎవరూ గుర్తుపట్టలేరు. పునాదులు, బీమ్‌ల కోసం సాధారణ కాంక్రీట్ ఉపయోగించి ఈ నిర్మాణానికి పూర్తి స్థిరత్వాన్ని అందించారు.

Eco Friendly Home

ప్రకృతి విపత్తులను తట్టుకునే సామర్థ్యం:

సాధారణ ఇటుకల కంటే ఈ ప్లాస్టిక్ బాటిళ్ల గోడలు చాలా దృఢమైనవని, భూకంపాలు, తీవ్రమైన తుఫానులను కూడా తట్టుకోగలవని పలాష్ చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడిన పలాష్ ప్రయత్నాన్ని స్థానికులు, నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ బాటిల్ హౌస్ ఒక గొప్ప మార్గదర్శకంగా నిలుస్తోంది.