
నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. వెయ్యి రోజుల పాలన సందర్భంగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో నిర్వహించిన మహిళా సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత తమదేనని సీతక్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు సంబంధించిన రూ.4 వేల కోట్లను ఎగ్గొట్టిందని ఆరోపించారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నామని, 60 ఏళ్లు దాటిన మహిళలకు కూడా సంఘాల్లో అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణంపై కొందరు మహిళల మధ్య జరుగుతున్న చిన్నపాటి గొడవలను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని సీతక్క విమర్శించారు. మహిళా సంక్షేమంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు.
ALSO READ : ఏపీ మాజీ డిప్యూటీ CM ఆళ్ల నాని కన్నుమూత
త్వరలో అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. కల్యాణలక్ష్మి పథకంపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ది రాజరిక వ్యవస్థ అని, అంటరానితనాన్ని ప్రోత్సహించే విధానాలను ఆ పార్టీ అనుసరిస్తోందని సీతక్క విమర్శించారు.