
పండుగ కొనుగోళ్ల సీజన్‌లో బంగారంపై హాల్ మార్క్ ఛార్జీలు పెరిగాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులపై హాల్‌మార్కింగ్ రుసుమును ఒక్కో వస్తువుకు రూ. 45 నుంచి రూ. 75కు పెంచింది.
సెప్టెంబర్ 14 నాటి BIS (హాల్‌మార్కింగ్) సవరణ నిబంధనలు, 2026 నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఈ సవరించిన రుసుములు అమల్లోకి వచ్చాయి. వెండి వస్తువులకు హాల్‌మార్కింగ్ రుసుమును ఒక్కో వస్తువుకు రూ. 35 దగ్గర యథాతథంగా ఉంచారు.
సవరించిన షెడ్యూల్ IV ప్రకారం.. నగల వ్యాపారులు ఇకపై గుర్తింపు పొందిన అసెయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలలో (AHCలు) ప్రతి బంగారు వస్తువుకు హాల్‌మార్కింగ్ కోసం రూ. 75 చెల్లించాలి. ప్రతి సరుకు రవాణాకు కనీస ఛార్జీ రూ. 200 వర్తిస్తుంది. వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న ప్రతి వస్తువుకు రూ. 35 రుసుము కొనసాగుతుంది. దీనికి అదనంగా సరుకు రవాణాకు కనీస ఛార్జీ రూ. 150 ఉంటుంది.
హాల్‌మార్కింగ్ అనేది విలువైన లోహ వస్తువుల స్వచ్ఛతను సూచించడానికి ఉపయోగించే BIS ధృవీకరణ వ్యవస్థ. హాల్‌మార్క్ చేయబడిన బంగారు ఆభరణాలు BIS ప్రమాణపు గుర్తును, స్వచ్ఛత లేదా ఫైన్‌నెస్ సూచనను, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్‌ను కలిగి ఉంటాయి.
►ALSO READ | బర్త్, డెత్ సర్టిఫికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి..
తాజా పెంపు.. బంగారంపై ఒక్కో వస్తువుకు విధించే హాల్‌మార్కింగ్ ఛార్జీలో దాదాపు 67% పెరుగుదలను సూచిస్తుంది. ముఖ్యంగా, ఈ రుసుము వస్తువుల బరువుకు కాకుండా వాటి సంఖ్యకు ముడిపడి ఉంటుంది. అంటే.. ఒక గ్రాము బంగారు వస్తువుకు, దానికంటే పరిమాణంలో బరువైన బంగారు వస్తువుకు కూడా 75 రూపాయల ఒకే హాల్‌మార్కింగ్ ఛార్జీ వర్తిస్తుంది. ఈ హాల్ మార్క్ ఛార్జీలు కూడా బంగారం కొనుగోలు చేసే వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.