
- ఉద్యోగ సంఘాల పోరాటానికి మా మద్దతు ఉంటుంది
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 18లోగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్చేశారు. లేదంటే హైదరాబాద్ దిగ్బంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని కోరారు. ఉద్యోగ సంఘాల పోరాటానికి టీఆర్ఎస్ అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మంగళవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. డీఏలు, పీఆర్సీ, పెన్షన్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవే సమస్యలపై గత ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్లు తిట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఎందుకు మేలు చేయడం లేదని ప్రశ్నించారు.
కనీసం ఉద్యోగుల హెల్త్ కార్డులు కూడా పనిచేయని పరిస్థితి ఉందని ఆమె విమర్శించారు. ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మళ్లీ గెలవలేదని కవిత గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను అడిగే విషయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు.
ఏ ప్రభుత్వమైనా పారదర్శకమైన పాలన అందించాలంటే అందుకు ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు సంతోషంగా, గౌరవంగా ఉండేలా చూస్తామని, వాళ్లను అభివృద్ధిలో డెవలపర్స్ గా చేస్తామని కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.