Reading Time: 2 minutes
Sridevi Chennai Property Dispute Supreme Court Status Quo Boney Kapoor

Actor Sridevi: దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఆస్తి వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతానికి ‘యథాతథ స్థితి’ (Status Quo) కొనసాగించాలని స్పష్టం చేసింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎం.సి. శివకామి, ఆమె సోదరుడు ఎం.సి. నటరాజన్ దాఖలు చేసిన అపీలును విచారించిన జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీల ధర్మాసనం.. శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు నోటీసులు జారీ చేసింది.

ఏంటి ఈ ఆస్తి వివాదం?
అసలు ఈ ఆస్తి వివాదం వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది. 1988 ఏప్రిల్ 19న ఎం.సి. నిత్యానంద ముదలియార్ అనే వ్యక్తి నుంచి శ్రీదేవి, ఆమె చెల్లెలు శ్రీలత, తల్లి రాజేశ్వరి కలిసి చెన్నైలోని ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. అయితే ఈ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ పత్రాలు (సేల్ డీడ్స్) చెల్లకుండా రద్దు చేయాలంటూ శివకామి, నటరాజన్, వారి తల్లి చంద్రభాను చెంగల్పట్టు అదనపు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి తమ తాత ఎం.సి. సంబంధ ముదలియార్‌దని, ఆయన కుమారుడైన తమ తండ్రి చంద్రశేఖరన్ ముదలియార్ ద్వారా తమకు ఇందులో 1/5వ వంతు వాటా వస్తుందని వారు వాదించారు. సంబంధ ముదలియార్‌కు నిత్యానంద, చొక్కలింగం, చంద్రశేఖరన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ పిటిషన్‌పై చెంగల్పట్టు కోర్టు బోనీ కపూర్ కుటుంబానికి సమ్మన్లు జారీ చేయడంతో, వారు హుటాహుటిన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కపూర్ కుటుంబం గట్టి వాదనలు వినిపించింది. పిటిషనర్లు చెబుతున్న చంద్రశేఖరన్‌కు, చంద్రభానుకు వివాహం జరగలేదని, వారిది కేవలం సహజీవనం (Live-in relationship) మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రశేఖరన్‌కు 1957 జూన్‌లో ఎం.సి. భానుమతి అనే మహిళతో మొదటి పెళ్లి జరిగిందని, ఆ బంధం ఏ కోర్టు ద్వారా కూడా రద్దు కాలేదని తెలిపారు. కాబట్టి చట్టబద్ధంగా చూస్తే శివకామి, నటరాజన్, చంద్రభానులు చంద్రశేఖరన్ వారసులు కారనేది కపూర్ కుటుంబం ప్రధాన వాదన.

ఇక, ఈ వాదనలతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 20న ఇచ్చిన తీర్పులో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. కేవలం ఆస్తిని కాజేయాలనే దురుద్దేశంతో, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ వీరు విభజన దావా వేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. కాలపరిమితి దాటిపోయిన ఈ కేసులో ఎలాంటి న్యాయపరమైన ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, చంద్రశేఖరన్ మొదటి భార్య భానుమతి 1998 వరకు జీవించే ఉన్నారని, ఆమెకు పిల్లలు లేరనే విషయాన్ని పిటిషనర్లు గతంలో రెవెన్యూ విచారణలో అంగీకరించి కూడా, ఈ కేసులో ఆ నిజాన్ని దాచిపెట్టారని హైకోర్టు గుర్తించింది. చంద్రశేఖరన్‌కు ఏకైక వారసులమని చెబుతూ 2005 జూన్ 21న పిటిషనర్లు పొందిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా ఇప్పటికే రద్దయిందని కోర్టు గుర్తుచేసింది. అయితే, మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాజాగా అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించి శ్రీదేవి కుటుంబానికి నోటీసులు జారీ చేసింది.