
యాదాద్రి/ యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో రోగుల నమోదు, మందుల లభ్యత, వైద్య పరీక్షల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.
అనంతరం తహసీల్ ఆఫీస్‌ను తనిఖీ చేసిన ఆయన.. రికార్డులను, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఎంపీడీవో ఆఫీస్‌లో వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిపై రివ్యూ చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రవి కుమార్, ఎంపీడీవో గీతారెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.