
UPI Charges: అక్టోబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీ రాబోతోంది. కానీ ఇందులో ఒక ముఖ్యమైన మెలిక ఉంది. చెల్లింపు చేసే వ్యక్తిగా మీకు ఎలాంటి ఛార్జీ విధింపు ఉండదు. కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఫ్రేమ్‌వర్క్, రూ. 2,000 పైబడిన డైరెక్ట్ యూపీఐ చెల్లింపులపై మర్చంట్‌లకు 0.4% ఛార్జీని విధిస్తుంది. ఈ ఛార్జీని మర్చంట్ తన అక్వైరింగ్ బ్యాంక్‌కు చెల్లించాలి. అలాగే రూ. 75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఇది రూ. 300కు పరిమితం చేశారు.
మీపై ఎలాంటి ప్రభావడం పడుతుంది?
మీరు ఒక దుకాణంలో UPI ద్వారా రూ.1,500 చెల్లిస్తే ఎలాంటి ఛార్జ్ పడదు. మీరు రూ. 3,000 చెల్లిస్తే, వ్యాపారి MDRలో రూ. 12 చెల్లిస్తారు. కానీ మీరు మాత్రం రూ. 3,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే మరింత ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. వినియోగదారుడు నేరుగా రుసుము చెల్లించకపోతే, అంతిమంగా ఆ భారాన్ని ఎవరు మోస్తారు?
మీరు రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లిస్తే ఏమి జరుగుతుంది?
కొత్త వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గం సంఖ్యల ద్వారానే తెలుసుకుందాం..
- రూ. 3,000 UPI చెల్లింపుపై ఎండీఆర్ రూ. 12 ఛార్జ్ వర్తిస్తుంది.
- రూ. 50,000 చెల్లింపుపై రూ. 200 ఉంటుంది.
- రూ. 75,000 చెల్లింపునకు రూ. 300 అవుతుంది. అదే గరిష్ట ఛార్జీ అవుతుంది. అందుకే రూ.1 లక్ష UPI చెల్లింపునకు కూడా రూ .400 కాకుండా రూ.300 మాత్రమే ఛార్జీ పడుతుంది. ఈ ఛార్జీ వ్యక్తి-వ్యాపారి (P2M) లావాదేవీలకు వర్తిస్తుంది. దీని అర్థం మీరు రూ. 3,000 విలువైన వస్తువును కొన్నప్పుడు మీ బ్యాంక్ ఖాతా నుండి అకస్మాత్తుగా అదనంగా రూ. 12 కట్ అవ్వదు. వ్యాపారి మాత్రమే ఈ ఎండీఆర్ ఛార్జీలను భరిస్తాడు.
UPI చెల్లింపులను స్వీకరించేటప్పుడు వ్యాపారులు MDRను వినియోగదారులకు బదిలీ చేయకూడదు. అందుకే మీ బిల్లు రూ.3,000 అయితే, ఒక వ్యాపారి కేవలం UPIకి రూ. 12 అదనపు ఖర్చవుతుందని చెప్పి మీ నుండి రూ. 3,012 వసూలు చేయలేరు. యూపీఐ ద్వారా చెల్లింపులను స్వీకరించేటప్పుడు వ్యాపారులు ఎండీఆర్‌ను కొనుగోలుదారులకు బదిలీ చేయకూడదని ఈ ఫ్రేమ్‌వర్క్ చెబుతోంది. వినియోగదారులు ప్రకటించిన ధరనే చెల్లించాల్సి ఉంటుంది. UPI యాప్ ప్రొవైడర్లు కూడా UPI చెల్లింపులపై ప్లాట్‌ఫారమ్ ఫీజు లేదా మరే ఇతర ఛార్జీని విధించలేరు. అందువల్ల, వినియోగదారులకు లావాదేవీ ఉచితంగానే ఉంటుంది.
ఇది కూడా చదవండి: SBI డెబిట్ కార్డ్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉంటాయని మీకు తెలుసా? ఎవ్వరు చెప్పని ఇన్ఫర్మేషన్..!
మరొక వ్యక్తికి డబ్బు పంపడానికి కూడా ఎటువంటి రుసుము లేదు. స్నేహితునికి, కుటుంబ సభ్యునికి లేదా మీకు చెందిన మరో ఖాతాకు అయినా, బదిలీ చేసిన మొత్తంతో సంబంధం లేకుండా వ్యక్తి నుండి వ్యక్తికి చేసే బదిలీలు ఉచితంగానే ఉంటాయి.
చాలా వరకు రోజువారీ UPI చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్త MDR, రూ. 2,000 లేదా అంతకంటే తక్కువ విలువ గల ప్రామాణిక P2M UPI లావాదేవీలకు వర్తించదు. FAQ ప్రకారం, ఈ లావాదేవీలు P2M UPI లావాదేవీల పరిమాణంలో 95% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.
ఇక టీ స్టాల్ వద్ద రూ. 100 చెల్లింపు, రూ. 700 కిరాణా బిల్లు లేదా రూ. 1,500 కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయి. ఈ లావాదేవీలపై MDR లేదు. మీరు ఒక వ్యాపారికి రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తానికి నేరుగా UPI చెల్లింపు చేసినప్పుడు ఈ మార్పు వర్తిస్తుంది .
ఒక రెస్టారెంట్ బిల్లు రూ. 2,500 అని అనుకుందాం.. మీరు నేరుగా ఖాతా నుండి వ్యాపారికి యూపీఐ ద్వారా చెల్లిస్తే, రెస్టారెంట్‌కు రూ. 10 ఎండీఆర్ ఛార్జ్ భారం పడుతుంది. మీరు ఇప్పటికీ రూ. 2,500 చెల్లించాలి. ఇప్పుడు రూ. 10,000 కొనుగోలును పరిగణించండి. వ్యాపారి ఎండీఆర్‌లో రూ. 40 చెల్లిస్తాడు.
రూ. 50,000 దాటితే, ఛార్జీ రూ. 200కి పెరుగుతుంది.
పెద్ద కొనుగోళ్లకు ఈ గరిష్ట పరిమితి ముఖ్యమవుతుంది. రూ.75,000 వద్ద 0.4% లెక్కింపు రూ.300కి చేరుకుంటుంది. అదే గరిష్ట పరిమితి అవుతుంది. అందువల్ల రూ.1 లక్ష లావాదేవీకి రూ. 400 కాకుండా రూ. 300 మాత్రమే వర్తిస్తుంది.
సాంప్రదాయ కార్డ్ చెల్లింపులతో ముడిపడి ఉన్న ఛార్జీల కంటే ఈ రేటు ఇప్పటికీ గణనీయంగా తక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతోంది . FAQ ప్రకారం, సాధారణ క్రెడిట్ కార్డ్ ఎండీఆర్‌లు 1.5% నుండి 2.5% వరకు, డెబిట్ కార్డ్ MDRలు 0.90% వరకు ఉంటాయి.
చిన్న దుకాణదారులకు ప్రత్యేక మినహాయింపు:
చిన్న వ్యాపారులకు రూ. 2,000 పరిమితి మాత్రమే రక్షణ కాదు. P2PM ఫ్రేమ్‌వర్క్ కింద UPI QR కోడ్‌ల ద్వారా నేరుగా తమ ఖాతాలలోకి నెలకు రూ. 1 లక్ష వరకు పొందుతున్న విక్రేతలు జీరో ఎండీఆర్‌ను పొందడం కొనసాగిస్తారు. దీని అర్థం, కేవలం ఒక కస్టమర్ రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లించినంత మాత్రాన ఒక చిన్న వ్యాపారి స్వయంచాలకంగా MDR చెల్లించడం ప్రారంభించడు.
ఉదాహరణకు, ఒక అర్హత కలిగిన చిన్న విక్రేత కస్టమర్ నుండి రూ. 2,500 అందుకుంటే, ఆ చెల్లింపు మాత్రమే ఆ విక్రేతను ఎండీఆర్ ఛార్జీలకు బాధ్యుడిని చేయరు. నెలవారీ అంతర్గత చెల్లింపు పరిమితిపై అర్హత ఆధారపడి ఉంటుందని ఫ్రేమ్‌వర్క్ చెబుతోంది.
కొన్ని చెల్లింపులకు కేవలం రూ. 5 మాత్రమే వసూలు:
ప్రామాణిక 0.4% MDR అన్ని రకాల వర్తకుల చెల్లింపులకు వర్తించదు. రైల్వేలు, టెలికాం సేవలు, భీమా, ఇంధనం వంటి కొన్ని వర్గాలలో రూ. 2,000 పైబడిన లావాదేవీలకు రూ. 5 ఫ్లాట్ MDR ఉంటుంది. అది పెద్ద చెల్లింపుల విషయంలో చాలా తేడా కలిగిస్తుంది. సాధారణ వ్యాపారి వద్ద రూ. 50,000 చెల్లింపుపై రూ. 200 రుసుము విధిస్తారు. అర్హత కలిగిన రూ. 50,000 బీమా చెల్లింపుపై కేవలం రూ. 5 మాత్రమే వసూలు చేస్తారు. రూ. 2,000 పైబడిన అర్హత గల ఇంధన చెల్లింపులకు అదే రూ. 5 ఫ్లాట్ రేటు వర్తిస్తుంది. రూ. 2,000 లోపు చెల్లింపులకు జీరో ఎండీఆర్‌ఉంటుంది.
రూ. 2,000 దాటిన విద్యుత్, నీరు, పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు చెల్లింపులపై ప్రామాణిక 0.4% రేటుకు బదులుగా ఫ్లాట్ రూ.5 MDR వర్తిస్తుంది. ఆ పరిమితి కంటే తక్కువ చెల్లింపులు జీరో MDR వద్దే ఉంటాయి.
మూలధన మార్కెట్ చెల్లింపులకు మరో కొత్త రేటు వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్‌లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లు, డీలర్లు, పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన చెల్లింపులపై 0.02% MDR వర్తిస్తుంది. దీని గరిష్ట పరిమితి రూ. 300.
ఇది కూడా చదవండి: Credit Card: మీ క్రెడిట్ కార్డు పేమెంట్ వెనుక ఇంత తతంగం ఉందా? ఎవరికి ఎంత ఛార్జీ వెళ్తుంది? వ్యాపారికి ఎంత?
ఇది కూడా చదవండి: PM Kisan: భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? కేంద్రం చెప్పిందేమిటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం