Reading Time: < 1 minute
Ap High Court Reserves Verdict 34 Percent Bc Reservation Local Body Elections

AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోల(1065, 105)పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రాజ్యాంగం నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని హైకోర్టులో న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు (ఎస్సీ+ఎస్టీ+బీసీ) 50% మించకుండా జీవోలను సవరించి అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై పలు కీలక ప్రశ్నలు గుప్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియామక ఉత్తర్వుల కాపీని తమ ముందు ఉంచాలని ఆదేశించడంతో పాటు, ఆ కమిషన్ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటని ప్రశ్నించింది. ఈ కమిషన్ ఏం అధ్యయనం చేసిందని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేయడానికి అనుసరించిన ప్రాతిపదిక, గణాంకాలు ఏంటో తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. కమిషన్ నివేదిక పూర్తి వివరాలను తాము స్వయంగా పరిశీలిస్తామని తెలిపింది. దీంతోపాటు, గతంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. అసలు ఏ ప్రయోజనం కోసం ఆ సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని తేల్చి చెప్పింది. ప్రభుత్వం సమర్పించే ఈ అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై తమ తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని వెల్లడిస్తూ ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.