
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మంచి ఆదరణ లభిస్తోంది. దెయ్యాలు, బ్లాక్ మ్యాజిక్ , మిస్టరీ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కిన సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దర్శకనిర్మాతలు కూడా ఈ తరహా కథలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి బాలీవుడ్‌లో తెరకెక్కిన ఓ చిత్రం మంచి కిక్ ఇస్తుంది . ఇందులో ఇద్దరు ప్రముఖ నటులు కలిసి నటించడంతో పాటు, ఓ స్టార్ హీరోయిన్ కూడా కీలక పాత్రలో కనిపించింది. ఆద్యంతం ఉత్కంఠను పంచే ఈ సినిమా పేరు ‘షైతాన్’. 2024లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటి జ్యోతిక కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్, సస్పెన్స్, సూపర్‌నేచురల్ థ్రిల్లర్ అంశాల కలయికతో రూపొందింది.
సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే కథలోకి ప్రేక్షకులను లాక్కెళ్లేలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా మాధవన్ పోషించిన పాత్ర సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. సినిమా కథ విషయానికొస్తే ఈ సినిమాలో అజయ్ దేవగన్ కబీర్ అనే వ్యక్తి పాత్రలో కనిపిస్తారు. తన భార్య జ్యోతి, పిల్లలు జాన్వీ, ధ్రువ్‌తో కలిసి కుటుంబ సమయాన్ని గడపడానికి ఫామ్‌హౌస్‌కు వెళ్తాడు. సాధారణంగా సాగాల్సిన వారి ప్రయాణం ఓ అనుకోని పరిచయంతో భయానక మలుపు తిరుగుతుంది. దారిలో ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న సమయంలో వనరాజ్ అనే ఓ వ్యక్తి వారి కుటుంబానికి పరిచయమవుతాడు. అతడు ఎంతో సాధారణంగా, స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ చిన్నారి జాన్వీకి ఓ స్వీట్ ఇస్తాడు. ఆ తర్వాత వారితో పాటే ఫామ్‌హౌస్‌కు వెళ్లి వారి సహాయం కోరతాడు. అయితే, వనరాజ్ కనిపించేంత అమాయకుడు కాదని క్రమంగా తెలుస్తుంది. అతని వెనుక దాగి ఉన్న అసలు రూపం కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా భయపెట్టేలా ఉంటుంది.
వనరాజ్ ఓ ప్రమాదకరమైన మాంత్రికుడు. బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిక్ కంట్రోల్ ద్వారా జాన్వీని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. వనరాజ్ ఏం చెప్పినా ఆమె అదే చేయాల్సి వస్తుంది. తన దుష్ట ప్రయోజనాల కోసం జాన్వీని ఉపయోగించుకోవాలని భావించే వనరాజ్‌ను అడ్డుకోవడం కబీర్‌కు పెద్ద సవాలుగా మారుతుంది. ఒకవైపు తన కూతురిని రక్షించుకోవాల్సిన బాధ్యత, మరోవైపు అత్యంత శక్తివంతమైన మాంత్రికుడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతాయి. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు కబీర్ ఎలాంటి పోరాటం చేశాడు? వనరాజ్ బారి నుంచి జాన్వీని రక్షించగలిగాడా? మాంత్రికుడి అసలు లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. హారర్, సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు తప్పకుండా చూడదగిన చిత్రంగా షైతాన్ చెప్పుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.