
బాగల్‌కోట్: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలు వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బాగల్‌కోట్ నమ్మ క్లినిక్కు మెడికల్ ఆఫీసర్గా అపాయింట్ అయిన బాగల్‌కోట్ ఎమ్మెల్యే ఉమేష్ మేటి మేనకోడలు డాక్టర్ అంకిత యరగల్‌ను విధుల నుంచి తొలగించారు.
2026 మార్చి నుంచి ఆమె సరిగ్గా క్లినిక్కే వెళ్లలేదు. కొన్ని నెలల పాటు ఆమె క్లినిక్ ముఖం కూడా చూడలేదు. కానీ.. జీతం మాత్రం నెలకు 70 వేలకు పైగా ఆమె అకౌంట్లో ఠంచనుగా క్రెడిట్ అయింది. బాగల్‌కోట్ నమ్మ క్లినిక్కు మెడికల్ ఆఫీసర్ లేకుండా అయిపోయింది. 2026 మార్చి నుంచి ఆమె గైర్హాజరైన రోజులతో సహా.. ఆ పోస్టులో కొనసాగుతున్నందుకు ఆమె నెలకు రూ. 70,000కు పైగా జీతం తీసుకోవడం కొసమెరుపు.
బాగల్‌కోట్ జిల్లా పంచాయత్ సీఈఓ గజానన్ బాలే, డాక్టర్ యరగల్‌కు నోటీసులు పంపారు. ఆమె తన పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులను కొనసాగిస్తూనే క్లినిక్కు వెళ్లకుండా జీతం పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఉదంతంలో బుధవారం జరిగే విచారణకు హాజరు కావాలని డాక్టర్ యరగల్‌ను ఆదేశించారు. విచారణకు హాజరయ్యేందుకు ఆమె చదువుకుంటున్న.. ఎస్. నిలింగప్ప మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి అనుమతి కూడా ఉంది. అయినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు.
►ALSO READ | కిరోసిన్.. నీటి ఆవిరితో పనిచేసే హైబ్రిడ్ స్టౌ: మధ్యప్రదేశ్ కుర్రాడి ప్రయోగం సక్సెస్
సెప్టెంబర్ 18న జరిగే విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణకు హాజరు కాకపోతే.. ఆమె వాదనను పరిగణనలోకి తీసుకోవడం జరగదని అధికారులు స్పష్టం చేశారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ ఏంటంటే.. అంకిత యరగల్ తండ్రి కూడా జిల్లా మరెవరో కాదు.. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DHO) రాజ్‌కుమార్ యరగల్. అంకితను మెడికల్ ఆఫీసర్‌గా నియమించడంలో కూడా DHO ప్రమేయం ఉందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా.. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.