Reading Time: 2 minutes

వానాకాలం 94% పంటలు వేసిన్రు..రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటీ 24 లక్షల 90 వేల ఎకరాల్లో సాగు 

Caption of Image.
  • 10 జిల్లాల్లో వంద శాతం కాగా..మరో 10 జిల్లాల్లో 90శాతంపైగా పంటలు
  • అన్ని పంటల సాగులో నల్గొండే టాప్​
  • పత్తిసాగులో నల్గొండ.. వరిలో నిజామాబాద్​ఫస్ట్ ప్లేస్​..
  • వికారాబాద్ జిల్లాలో 1.11లక్షల ఎకరాల్లో కంది వేసిన రైతులు
  • వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1 కోటి 24 లక్షల 90 వేల ఎకరాల్లో వానాకాలం సాగు జరిగింది. అంటే సాధారణ సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలుకాగా.. ఇందులో 94శాతం(1.24కోట్లుఎకరాల్లో )వరకు రైతులు పంటలు వేశారు. ఈ మేరకు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ సీజన్​సాగులో బుధవారం నాటికి అత్యధికంగా 55.89 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి.

 ఆ తరువాత 48.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ రెండు పంటలే 1 కోటి 4 లక్షల ఎకరాలు కాగా.. మిగతా పంటలు కేవలం 20 లక్షల ఎకరాలు కావడం గమనార్హం. మక్కజొన్న 5.93 లక్షల ఎకరాలు, కంది 5.57లక్షల ఎకరాలు, సోయా 3.72 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా.. ఈ మూడు పంటలు 15.22 లక్షల ఎకరాలు సాగైయ్యాయి. వికారాబాద్​జిల్లాల్లో లక్షా 11 వేల ఎకరాల్లో రైతులు కంది పంట వేశారు.

ఇక మిగిలిన పంటల్లో పెసర్లు, పల్లీ, మినుములు, జొన్న, సజ్జ, పల్లి, చెరుకు పంటలన్నీ కలిపి మరో 4.78 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ తేల్చింది. ఎల్​నినో పరిస్థితులు ఉన్నప్పటికీ వానాకాలం సీజన్​లో 94శాతం పంటల సాగు జరగడం గమనార్హం. నిరుడు ఇదే టైంకు 1.32కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా ఎల్​నినో పరిస్థితుల్లోనూ నిరుడు కంటే 7.41లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది. 

సాగు శాతం ఎక్కడెక్కడ ఎంతంటే..!

ఈ సీజన్​లో పది జిల్లాల్లో వంద శాతం కంటే అధికంగా పంటల సాగు జరిగింది. ఆదిలాబాద్​, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్​, భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం, మేడ్చల్ జిల్లాలో  పంటల సాగు 100 శాతం నమోదైంది.  వానాకాలం పంటల సాగులో నల్గొండ జిల్లా టాప్​లో నిలిచింది. ఈ ఒక్క జిల్లాలోనే 9.91లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది.  ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 7.05 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 5.88 లక్షల ఎకరాలు, నిజామాబాద్​జిల్లాలో 5.48 లక్షల ఎకరాలు , వికారాబాద్​జిల్లాలో 5.35 లక్షల ఎకరాలు,  సిద్ధిపేట జిల్లాలో 5.05 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 5.03 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది.   

నిజామాబాద్​లోనే వరి ఎక్కువేసిన్రు

ఈ వానాకాలం సీజన్​లో అత్యధికంగా సాగైన పంటల్లో వరి మొదటి స్థానంలో ఉండగా, నిజామాబాద్​జిల్లాలో అధికంగా  4.36 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఈ జిల్లాల్లోనే అత్యధికంగా వరిసాగు జరిగినట్లు వ్యవసాయశాఖ తేల్చింది. ఆ తరువాత నల్గొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3.45 లక్షల ఎకరాలు, సిద్ధిపేట జిల్లాలో 3.16 లక్షల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో తేల్చింది.ఇక, పత్తి పంటసాగులో నల్గొండ జిల్లా 5.93 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆదిలాబాద్​ 4.37 లక్షల ఎకరాలు, ఆసిఫాబాద్​జిల్లాలో 3.77లక్షల ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో 3.57 లక్షల ఎకరాల్లో  పత్తి సాగు జరిగినట్లు నివేదిక పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.