
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో అర్ధ సెంచరీతో సంజు శాంసన్ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టీ20లో 10 పరుగులకే ఔటైన సంజు.. రెండో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బదులుగా సంజును ఓపెనర్‌గా కొనసాగించడంపై జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా తెరపడింది.
సంజు శాంసన్ రెండో టీ20లో ఆడిన బ్యాటింగ్‌ను మాజీ భారత కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. సంజు ముందుగా క్రీజులో కుదురుకుని.. ఆ తర్వాత బౌలర్లపై దాడి చేయడం అద్బుతమన్నాడు. ఇది దీర్ఘకాలంలో మరింత స్థిరత్వాన్ని అందిస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో ఓపెనర్లకు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సంజు లాగా ముందుగా క్రీజులో సెట్ అయి.. ఆ తర్వాత బౌలర్లపై విరుచుకుపడటం అవసరం. అతడు ఇదే విధంగా ఆడితే ఇక ఫెయిల్ అవుతాడని నేను అనుకోను. ప్రతిసారీ 50లు, 60లు సాధిస్తూనే ఉంటాడు’ అని సన్నీ చెప్పుకొచ్చారు.
అయితే 190 లేదా 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితుల్లో మాత్రం తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాల్సి ఉంటుందని సునీల్ గవాస్కర్ చెప్పారు. ప్రతి మ్యాచ్‌లోనూ మొదటి బంతి నుంచే బౌండరీల కోసం ప్రయత్నించడం వల్ల కొన్నిసార్లు వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. సంజు అద్భుతమైన ఆటగాడని ప్రశంసించారు. సంజుకు వైభవ్ సూర్యవంశీ నుంచి పోటీ ఉందనే చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. టీమిండియా ఓపెనింగ్ స్థానాల్లో సంజూ, అభిషేక్ శర్మ, వైభవ్ పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. అయితే రెండో టీ20లో సంజు 57 పరుగులతో చెలరేగడంతో ఈ చర్చకు మరింత ఆసక్తి ఏర్పడింది.