
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలకు అద్దం పట్టేలా నిజామాబాద్ జిల్లాలో యువత వినూత్న నిరసన చేపట్టింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రూప్లా తండాలో గణపతి మండపం వేదికగా యూరియా కోసం లక్కీ డ్రా నిర్వహించారు. బంజారా కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కేవలం 99 రూపాయలకే టోకెన్ ఇచ్చి లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించారు. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన రైతుకు ఏకంగా మూడు యూరియా బస్తాలను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. సాధారణంగా లక్కీ డ్రాలో బహుమతులుగా నగదు, బహుమతులు ఇస్తారు.. కానీ ఇక్కడ మాత్రం రైతులకు అత్యవసరమైన యూరియా బస్తాలనే గిఫ్ట్‌గా పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
యూరియా కోసం రైతులు రోజుల తరబడి తిరుగుతున్నారని.. యాప్‌లో బుక్ చేసుకున్నా సకాలంలో ఎరువు అందడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. పంటకు అవసరమైన ఎరువు కోసం రైతులు ఇలా లక్కీ డ్రాపై ఆధారపడే పరిస్థితి వచ్చిందంటూ అధికారుల దృష్టిని ఆకర్షించేందుకే ఈ నిరసన చేపట్టామని బంజారా కింగ్స్ యూత్ సభ్యులు చెబుతున్నారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించి.. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..