Reading Time: < 1 minute
Gvmc Wards Delimitation Visakhapatnam Gets 120 Wards

GVMC Wards Delimitation: జనాభా పెరుగుతున్న కొద్ది.. వారి అవసరాలు.. పరిపాలన సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు వార్డులు, నియోజకవర్గాలు.. ఇలా పునర్విభజన చేస్తూనే ఉంటుంది.. ఇక, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ శాఖ తుది గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఉన్న 98 వార్డుల సంఖ్యను 120కి పెంచుతూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

వార్డుల పునర్విభజనపై గతంలో విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌కు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అధికారులు.. ఆ తర్వాత వార్డుల సరిహద్దులను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది మున్సిపల్ శాఖ.. వార్డు నంబర్ 1 నుంచి 120 వరకు ప్రతి వార్డు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు, సరిహద్దులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, గతంలో GVMCలో 98 వార్డులు ఉండగా.. తాజా పునర్విభజనతో GVMC పరిధిలో మొత్తం 120 వార్డులు అందుబాటులోకి రానున్నాయి.

కాగా, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి ఇప్పటికే ఏపీ సర్కార్‌ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం విదితమే.. రాష్ట్రంలోని 39 పురపాలక సంఘాలు (ULBs), నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన గడువు ముగిసింది.. విజయవాడ, తిరుపతి, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతో పాటు పార్వతీపురం, సాలూరు, నర్సీపట్నం, రామచంద్రపురం, జగ్గయ్యపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, మార్కాపురం, చీరాల, ప్రొద్దుటూరు, రాయచోటి, రాయదుర్గం, పుట్టపర్తి, బద్వేల్, నగరి, పుత్తూరు, కదిరి, యర్రగుంట్ల, జమ్మలమడుగు, పలమనేరులో ఈ నెల 3వ తేదీ నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని గతంలోనే నిర్ణించింది.. ఇక, GVMC, ఏలూరు, మచిలీపట్నం, పెడన, పిఠాపురం, ఒంగోలు, గుంటూరు, కడప, ధర్మవరం, తాడిపత్రి, నంద్యాలలో ఈ నెల 8వ తేదీ నాటికి వార్డుల విభజన పూర్తి చేయడానికి గడువు విధించింది. మరోవైపు, చిలకలూరిపేట, నెల్లూరు నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 15 అంటే ఇవాళ్టి వరకు పూర్తిచేసేలా ఏపీ మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టిన విషయం విదితమే..