
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా కవర్ చేస్తున్న న్యూస్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం చాట్స్‌వర్త్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
లాస్ ఏంజెల్స్‌లోని శాన్ ఫెర్నాండో వ్యాలీలో నార్తాఫ్ స్ట్రీట్, డీ సోటో అవెన్యూ కూడలికి సమీపంలోని ఓ సెల్ఫ్-స్టోరేజ్ సదుపాయం దగ్గర పార్కింగ్ లాట్‌లో హెలికాప్టర్ కూలిపోయింది. లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద స్థలంలో ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి ఎలా ఉందనే వివరాలు వెంటనే వెల్లడించలేదు. మృతుల్లో కనీసం ఒకరు హెలికాప్టర్‌లో ఉన్న వ్యక్తి కాకుండా.. ప్రమాద సమయంలో నేలపై ఉన్న పాదచారి అయి ఉండొచ్చని ఫైర్ కెప్టెన్ బ్రాండెన్ సిల్వర్‌మన్ తెలిపారు.
NBC న్యూస్ హెలికాప్టర్‌గా గుర్తింపు
ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను NBC Los Angeles (KNBC-TV)కు చెందిన న్యూస్ హెలికాప్టర్‌గా గుర్తించారు. అంతకుముందు అదే ప్రాంతంలో లాస్ ఏంజెల్స్ మెట్రో బస్సు-ఓ ప్రయాణికుల వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ఘటనను కవర్ చేసేందుకు హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. హెలికాప్టర్ రెండు భవనాల మధ్య కూలి.. షిప్పింగ్ కంటైనర్లు, అక్కడ పార్క్ చేసిన పలు వాహనాలపై పడినట్లు సమాచారం. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. సమీపంలోని వాహనాలకు కూడా మంటలు వ్యాపించగా.. అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకొచ్చారు.
కారణాలపై దర్యాప్తు
హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందనే దానిపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఎంతమంది ఉన్నారు. వారి పూర్తి వివరాలు కూడా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తులో భాగం కానున్నాయి. హెలికాప్టర్ పరిస్థితి, ప్రయాణించిన మార్గం, వాతావరణ పరిస్థితులు, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రమాదానికి దారితీసిన కారణాలను అధికారులు గుర్తించనున్నారు. ఒకవైపు రోడ్డు ప్రమాదం.. మరోవైపు అదే ఘటనను కవర్ చేస్తున్న న్యూస్ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో చాట్స్‌వర్త్ ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
BREAKING: TV news helicopter crashes during live shot of bus crash in Los Angeles.
The helicopter belongs to NBC Los Angeles (KNBC-TV). No word yet on casualties. https://t.co/kXwgr5meOP
— BNO News (@BNONews) September 16, 2026