Reading Time: 4 minutes
Story Board Over Delimitation

 

జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీద కు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ పైన మరో సారి కేంద్రం వేగంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలు ఇంతవరకూ ప్రోరోగ్ కాకపోవడం వెనుక డీలిమిటేషన్ వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్‌కు ఆమోదం విషయంలో ఇప్పటికే విఫలమైన కేంద్రం.. మరోసారి తన అభీష్టం నెరవేర్చుకోవాలని భావిస్తోంది. ఇంతకూ సంఖ్యాబలం విషయంలో స్పష్టత ఉందా..? దక్షిణాది అభ్యంతరాలను అడ్రస్ చేయగలరా..? డీలిమిటేషన్ ముహూర్తం యూపీ ఎన్నికలకు ముందా.. తర్వాతా..?

వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్ చేయకపోవడం వెనుక డీలిమిటేషన్ వ్యూహం ఉందని కాంగ్రెస్ ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ అధికారికంగా స్పందించకపోయినా.. లోపాయికారీగా వ్యూహరచన చేస్తోందనే చర్చ అయితే ఆగటం లేదు. దీంతో మరోసారి డీలిమిటేషన్ జరిగితే ఏంటి..? జరగకపోతే ఏమౌతుంది..? అనే ప్రశ్నలు కీలకంగా మారుతున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం పట్టుదలగా ఉందనేది బహిరంగ రహస్యం. మొదట బడ్జెట్ సెషన్లో డీలిమిటేషన్ విషయంలో భంగపడ్డ కేంద్రం.. తర్వాత వర్షాకాల సమావేశాల్లో అసలు బిల్లు పెట్టే సాహసమే చేయలేకపోయింది. కానీ 2029 ఎన్నికలకు డీలిమిటేషన్‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్న కేంద్రం.. అందుకోసమే వర్షాకాల సమావేశాల్ని ఇంతవరకూ ప్రోరోగ్ చేయలేదనే అభిప్రాయాలున్నాయి. వాటిని బలపరిచే విధంగా ఏ క్షణమైనా పార్లమెంట్ సమావేశాలు జరుపుతారనే లీకులు బయటికొస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగియగానే మోడీ విదేశీ టూర్లు, ఆ తర్వాత బ్రిక్స్ సమావేశాలతో కేంద్రం బిజీగా ఉంది. ఇప్పుడు కీలక సమావేశాలు ముగియడంతో.. మరోసారి పార్లమెంట్ వ్యూహాలపై దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది.

ఇక్కడ డీలిమిటేషన్‌కు జనాభా లెక్కలకూ లింక్ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో తాజా జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, లోకసభ నియోజకవర్గాల విభజన ప్రక్రియ ను సత్వరమే పూర్తి చేయాలన్నది కేంద్రం ఆలోచనగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకుగాను, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా డిలిమిటేషన్‌ ప్రక్రియను కొత్త జనాభా లెక్కలతో ముడిపెట్టే నిబంధనను సవరించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే 2023లో పార్లమెంట్ చేసిన 106వ రాజ్యాంగ సవరణ చట్టం నారీ శక్తి వందన్ అధినియం ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే, రాజ్యాంగ సవరణ తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరగాలి. అయితే, 2021 లో జరగాల్సిన జనాభా లెక్కలు ఆలస్యం కావడంతో, ఇటీవలే జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి. కానీ 2026 జనాభా లెక్కలు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగానే డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి, తద్వారా 33 శాతం మహిళా రిజర్వేషన్లను కూడా 2029 లో రానున్న లోకసభ ఎన్నికల్లో అమలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పంగా ఉందని భావిస్తున్నారు.

పార్లమెంట్‌లో ప్రస్తుతం ఉన్న 543 లోకసభ స్థానాలను 50 శాతం పెంచడం ద్వారా, మొత్తం లోకసభ స్థానాలు 816 కు పెరిగే ప్రతిపాదనను కేంద్రం ఇప్పటికే అన్ని పార్టీల ముందు పెట్టింది. జనాభా నియంత్రణ ను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిద్యం కోల్పోకుండా, అన్ని రాష్ట్రాల లోకసభ స్ధానాలను 50 శాతం నిష్పత్తిలో పెంచడం ద్వారా, సభలో ప్రస్తుత భాగస్వామ్య శాతాన్ని యధాతధంగా కొనసాగే ప్రతిపాదన చేసింది. అలా చూసినప్పుడు తాజా డీలిమిటేషన్ తర్వాత, దక్షిణాది రాష్ట్రాల స్థానాలు లోకసభ లో 129 నుంచి 195కి పెరుగుతాయని కేంద్రం సంకేతాలిస్తోంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ లో 25 నుంచి 38 కు లోక్‌సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ లో 17 నుంచి 26 కి లోక్‌సభ సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక దేశంలో మొత్తంగా లోకసభ స్థానలు 816 కు పెరిగితే, అందులో మహిళలకు కేటాయించే స్థానాల సంఖ్య 273 వరకు ఉంటుంది. పనిలోపనిగా లోకసభ స్థానాల సంఖ్య గరిష్ట పరిమితిని 850 గా విధించే ఆలోచన కూడా కేంద్రానికి ఉందంటున్నారు. ప్రస్తుతం, లోకసభలో గరిష్ట పరిమితి 550 స్థానాలుగా ఉంది.

లోక్‌సభ లో మొత్తం సభ్యుల సంఖ్య 816కు పెరిగినా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిద్యం వాటా దాదాపు 24 శాతం వద్దే స్థిరంగా ఉంటుందని కేంద్రం దక్షిణాది పార్టీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక రాజ్యసభ విషయానికొస్తే.. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ లో గరిష్ట సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లో రాజ్యసభ సభ్యుల సంఖ్యను యధాతధంగా ఉంచుతుందని చెబుతున్నారు. దీని కారణంగా రాజ్యసభతో పోలిస్తే లోక్‌సభ పరిమాణ నిష్పత్తి మారుతుంది. ఇది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాజ్యసభ సభ్యుల సాపేక్ష ఓట్ల వాటాను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరిగినప్పుడు, లోక్‌సభ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, రాజ్యసభలో ప్రతిపక్షానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నప్పటికీ, లోక్‌సభలో అధికార పార్టీ కి 56 శాతం సీట్లు ఉంటే రాజ్యసభను అధిగమించవచ్చు. ఒక సభ ఆమోదించిన బిల్లును మరో సభ తిరస్కరించినా, ఆరు నెలలకు పైగా పెండింగ్‌లో ఉంచినా , లేదా చట్ట సవరణలపై ఉభయ సభల మధ్య తీవ్ర విభేదాలు వచ్చినా, ఉభయ సభల ఉమ్మడి సమావేశం నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 అవకాశం వీలు కల్పిస్తుంది. అప్పుడు, లోకసభ సభ్యుల బలంతో, అధికార పార్టీ రాజ్యసభ ను అధిగమించే అవకాశం ఉంది. తద్వారా ఇప్పటిదాకా లోక్‌సభలో బలం ఉన్నా.. రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేక వెనుకాడే ప్రభుత్వాలకు.. ఇకపై ఆ అడ్డంకి లేనట్టే అవుతుది.

ఇక డీలిమిటేషన్ విషయంలో నంబర్‌ గేమ్ కీలకమనే సంగతి ఇప్పటికే రుజువైన విషయం. అందుకే కేంద్రం సంఖ్యా పరంగానూ జాగ్రత్త పడుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఆమ్‌ ఆద్మీ పార్టీ చీలిక ఎంపీలతో పాటుగా డీఎంకే నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. అందులో భాగంగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కు కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్ లో డీఎంకే చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ నెలాఖరు లోగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదం పొందే విధంగా బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి ఉన్న ప్రణాళిలను ప్రతిపక్షాలతో పంచుకోవాలని, మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లను పెంచవద్దని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. నిజానికి తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఆమ్‌ ఆద్మీ పార్టీలలో జరిగిన వరుస ఫిరాయింపుల తరుణంలో, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం డీలిమిటేషన్‌ బిల్లును తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ, కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమంతో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ, డీలిమిటేషన్‌ బిల్లు కోసం కసరత్తును కేంద్రం ఆపలేదని, పూర్తి మెజారిటీని సాధించేందుకు పావులు కదుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వం సుమారు 298 మంది ఎంపీల మద్దతును మాత్రమే సాధించగలిగింది. అవసరమైన సంఖ్యాబలం కంటే ఇది తక్కువ. ఈసారి బిల్లును ఆమోదించాలంటే సుమారు 350 నుంచి 360 మంది ఎంపీల మద్దతు అవసరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ బలం సుమారు 326కి చేరినట్లు అంచనా. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, కొందరు స్వతంత్రుల మద్దతుతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ అవసరమైన సంఖ్యను చేరుకోవడానికి అదనపు మద్దతు తప్పనిసరి. మరోవైపు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా సంఖ్యాబలం కూడా గతంతో పోలిస్తే తగ్గింది. గతంలో బిల్లుకు వ్యతిరేకంగా సుమారు 230 మంది ఎంపీలు ఏకమయ్యారని పేర్కొనగా, ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 189కు చేరినట్లు అంచనా. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లో జరిగిన చీలికలు ప్రతిపక్ష సంఖ్యాబలంపై ప్రభావం చూపాయి. దీంతో డీఎంకే వైఖరి అధికార, ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారింది. ఈ తరుణంలో డీఎంకేను తమవైపు నిలబెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్ష పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎటూ తేల్చని డీఎంకే.. పార్లమెంట్‌లో దక్షిణాదికి ప్రస్తుతం ఉన్న ప్రాతినిథ్యం కొనసాగితే మద్దతు ఇస్తామన్నట్టుగా పరోక్ష సంకేతాలు పంపుతోంది. ఇదే అదనుగా కేంద్రంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఏకంగా డీఎంకేకు స్థానం కల్పించే దిశగా అంతర్గత కసరత్తు జరుగుతోందన్న ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది.

మొత్తంగా డీలిమిటేషన్ విషయంలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు వేగం పుంజుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు డీలిమిటేషన్‌తో ముడిపెట్టి అధికార పక్షం తొలి ఎత్తు వేస్తే.. నిర్ద్వంద్వంగా తిరస్కరించిన విపక్షం పైఎత్తు వేసింది. కానీ వర్షాకాల సమావేశాల్లో రెండు పక్షాలూ చివరిదాకా దోబూచులాడినా.. కీలక బిల్లు మాత్రం వివిధ కారణాలతో సభ ముందుకు రాలేదు. మరి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో నంబర్‌ గేమ్‌తో సహా ఇంకా ఎలాంటి రాజకీయ వ్యూహాలకు తెరలేస్తుందనేది చూడాల్సి ఉంది. అంతేకాకుండా డీలిమిటేషన్ ముహూర్తం ఖరారైందా.. లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదనే వాదన కూడా ఉంది. డీలిమిటేషన్ యూపీ ఎన్నికల ముందా.. తర్వాతా అనే విషయంలోనూ బీజేపీ మల్లగుల్లాలు పడుతుందా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు.