Reading Time: < 1 minute
Mahesh Babu Next Movie After Varanasi Sandeep Reddy Vanga Buchi Babu Bhansali In Talks

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో కలిసి పనిచేయబోతున్నారన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గంలో ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు బుచ్చిబాబు సానా, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు గతంలో ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ సినిమా ఉండొచ్చనే టాక్ కూడా వినిపించింది. మరోవైపు అనిల్ రావిపూడి పేరు కూడా ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. మహేష్‌తో తన తదుపరి సినిమా లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు.. సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు సినిమా చేసే అవకాశాలపై కూడా కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు వినిపిస్తోంది. మహేష్ కోసం భన్సాలీ ఓ పీరియాడిక్ కథను సిద్ధం చేసి నేరేట్ చేశారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు.

అలాగే రాజమౌళితో సినిమా పూర్తయితే.. మహేష్ బాబు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపును పొందే అవకాశం ఉంది. అందుకే ‘వారణాసి’ తర్వాత ఆయన ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ దర్శకుడితో జతకడతారు? అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.