Reading Time: 2 minutes

అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నో రెస్పాన్స్.. ఓ కంపెనీ సీఈవో చేసిన పని సోషల్ మీడియాలో వైరల్

Caption of Image.

సామాజిక స్పృహ కలిగి ఉండటం ఈ రోజుల్లో అరుదైన విషయం.సమాజానికి సంబంధించిన సమస్య ఎదురైతే.. “నాకెందుకులే” అంటూ తప్పించుకునేవారే ఎక్కువ. కానీ, మన చుట్టూ ఉన్న సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మనదే అని భావించే వారు మాత్రం కొందరే. అలాంటి వారిలో ఒకరిగా నిలిచారు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, భారత్‌ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈవో సిద్ధార్థ్ దియలానీ. ఓవైపు కంపెనీ బాధ్యతలు, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. తన చుట్టూ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సమస్యను పట్టించుకోకుండా వదిలేయలేదు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో.. “ఎవరో వచ్చి చేస్తారు” అని ఎదురుచూడకుండా, ఓ పౌరుడిగా తన వంతు బాధ్యతను స్వయంగా నిర్వర్తించారు. ఇందుకోసం సొంత డబ్బుతో ఫుట్‌పాత్‌ను మరమ్మతు చేయించారు. ఆయన చేసిన ఈ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. పెద్ద మేసేజ్ ను ఇస్తోంది.

కంపెనీ సీఈవోగా తన బాధ్యతలకే పరిమితం కాకుండా, ఓ పౌరుడిగా సామాజిక బాధ్యతను చాటిన సిద్ధార్థ్ దియలానీ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నారు. బెంగళూరులోని కోరమంగళలో తన సొసైటీ సమీపంలో ఏళ్లుగా పాడై ఉన్న ఫుట్‌పాత్‌ను బాగుచేయించేందుకు ఆయన పలుమార్లు అధికారులకు కంప్లైంట్ చేశారు. BBMPకి ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA)కి ఇమెయిల్ పంపారు. అధికారిక టికెట్ రైజ్ చేయడంతో పాటు వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను కూడా సంప్రదించారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు తానే స్వయంగా రంగంలోకి దిగారు.

సిద్ధార్థ్ దియలానీ స్వయంగా ఫుట్‌పాత్‌ను మరమ్మతు చేయించి, ర్యాంప్‌ను నిర్మించారు. ఇందుకోసం కూలీ, సిమెంట్ తదితర ఖర్చులతో కలిపి రూ.2వేల700 సొంతంగా ఖర్చు చేశారు. రిపేర్ల అనంతరం ముందు, తర్వాత ఫొటోలను Xలో పంచుకున్నారు.

►ALSO READ | ముంబై వీధుల్లో బిచ్చగాడిగా వేల కోట్ల సంపన్నుడు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన BJP ఎమ్మెల్యే?

“ఇప్పుడు స్ట్రోలర్‌తో వచ్చే తల్లిదండ్రులు, వీల్‌చైర్‌పై ఉన్న వృద్ధులు ఈ దారిని కంఫర్టబుల్ గా ఉపయోగించుకోవచ్చు” అంటూ రాశారు.  అంతేకాదు, బెంగళూరులోని మరిన్ని ప్రాంతాలను మెరుగుపరిచేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే, “మార్పు కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు” అనే మేసేజ్ ను తన చర్యతో సిద్ధార్థ్ చాటిచెప్పారు. CEOగా విజయాలు సాధించిన వ్యక్తి, ఓ పౌరుడిగా సమాజానికి చేసిన ఈ చిన్న ప్రయత్నం స్ఫూర్తిగా నిలుస్తోంది.

©️ VIL Media Pvt Ltd.