
ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురం గ్రామంలో విషాద ఘటన వెలుగుచూసింది. కొడుకు, కూతురికి పురుగుల మందు తాగించి.. తాను కూడా తాగి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది.
ఈ ఘటనలో.. తండ్రి, కూతురు చనిపోయారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయనకు పది ఎకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది.
ఈ పది ఎకరాలకు తోడు మరో పది ఎకరాలను ఎన్టీఆర్ జిల్లా గండ్రాయిలో, పెదమండవ గ్రామంలో మరో పది ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయో.. వ్యవసాయం కారణంగా నష్టపోయారో తెలియదు గానీ శ్రీనివాస రావు గండ్రాయిలో తాను కౌలుకు తీసుకున్న పొలం దగ్గరకు కొడుకు, కూతురును బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. కొడుకు నిఖిల్, కూతురు లాస్యకు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించాడు. తర్వాత తాను కూడా అదే కూల్ డ్రింక్ తాగాడు.
పురుగుల మందు తాగి పొలంలో కొట్టుమిట్టాడుతున్న ఈ ముగ్గురినీ గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే.. శ్రీనివాసరావు దారిలోనే చనిపోయాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు కూతురు లాస్య కూడా చనిపోయింది.
శ్రీనివాసరావు కొడుకు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. గ్రామస్తులను ఈ ఘటన గురించి ఆరా తీయగా.. ఆర్థిక ఇబ్బందులు లేవని.. ఎందుకు ఈ దారుణానికి శ్రీనివాసరావు ఒడిగట్టాడో అర్థం కావడం లేదని చెప్పారు. భార్యాభర్త మధ్య గొడవలున్నాయేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.