
భారతదేశంలో పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, సమ్మిళిత విద్య, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దేశవ్యాప్తంగా 14.71 లక్షల పాఠశాలల్లో 24.69 కోట్లకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. దీంతో విద్యా వ్యవస్థలో కేవలం విద్యార్థులు చదువుతున్నారా లేదా అన్నదే కాకుండా.. వారు ఏం నేర్చుకుంటున్నారు? ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? అనే అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ మార్పుకు మార్గదర్శకంగా జాతీయ విద్యా విధానం–2020 (NEP 2020) నిలుస్తోంది. ఈ విధానాన్ని పాఠశాల స్థాయిలో ఆచరణలోకి తీసుకురావడంలో ‘పీఎం శ్రీ’ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
పీఎం శ్రీ పథకం అంటే ఏమిటి?
2022 సెప్టెంబర్ 7న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – PM SHRI’ పథకం కేంద్ర ప్రాయోజిత పథకం. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే ఉన్న పాఠశాలలను మరింత ఆధునీకరించి, వాటిని జాతీయ విద్యా విధానం–2020ను సమర్థవంతంగా అమలు చేసే ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. మొత్తం రూ.27,360 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ పథకం కింద 14,500కు పైగా పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన, ప్రోత్సాహకరమైన వాతావరణంతో పాటు.. మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక బోధనా వనరులు, విభిన్నమైన అభ్యసన అనుభవాలను అందించడం దీని ఉద్దేశం.
ఇప్పటికే 13,092 పాఠశాలలు ఎంపిక
2026 జూలై నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13,092 పాఠశాలలు పీఎం శ్రీ పాఠశాలలుగా ఎంపికయ్యాయి. ఇందులో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS), NCERT పరిధిలోని పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇది నిర్దేశించిన లక్ష్యంలో దాదాపు 90 శాతం. ఈ పథకం ద్వారా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నేరుగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
కేవలం పాఠశాలల అభివృద్ధి కాదు.. ఒక మోడల్ వ్యవస్థ
పీఎం శ్రీ పథకం కేవలం ఎంపికైన పాఠశాలలను అభివృద్ధి చేయడంతో ఆగిపోదు. ఈ పాఠశాలలను తమ ప్రాంతంలోని ఇతర పాఠశాలలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తమలోని ఉత్తమ విధానాలను ఇతర పాఠశాలలతో పంచుకోవడం, మార్గదర్శకత్వం ఇవ్వడం, సహకరించడం ద్వారా మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడమే దీని విస్తృత లక్ష్యం. విద్యార్థుల్లో జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని పెంపొందించడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, అవసరమైతే పాత ఆలోచనలను మార్చుకుని మళ్లీ నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచడం కూడా ఈ పథకంలో కీలక అంశాలు.
పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రధాన దృష్టి
2022–23 నుంచి 2026–27 వరకు ఐదేళ్ల పాటు పీఎం శ్రీ పథకం అమలవుతోంది. మొత్తం వ్యయం రూ.27,360 కోట్లు కాగా.. ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ఆమోదించిన వ్యయంలో కేంద్ర వాటా 2023–24లో రూ.2,520 కోట్ల నుంచి 2026–27లో రూ.5,224 కోట్లకు పెరిగింది. అంటే సుమారు 107 శాతం పెరుగుదల. ఇది పీఎం శ్రీ పాఠశాలల బలోపేతానికి కేంద్రం పెంచుతున్న పెట్టుబడిని సూచిస్తోంది.
నాణ్యమైన, సమ్మిళిత విద్య
పీఎం శ్రీ పాఠశాలల ప్రధాన లక్ష్యం ప్రతి విద్యార్థికి సమానమైన, నాణ్యమైన, ఆనందదాయకమైన విద్య అందించడం. విద్యార్థుల సామాజిక, ఆర్థిక నేపథ్యం, భాష, అభ్యసన సామర్థ్యం వంటి భిన్నతలను పరిగణనలోకి తీసుకుని బోధన సాగుతుంది. ప్రత్యేకంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
అనుభవం ద్వారా విద్య
పుస్తకాల్లో చదివే విద్యకే పరిమితం కాకుండా.. అనుభవం ద్వారా నేర్చుకోవడంపై పీఎం శ్రీ పాఠశాలలు దృష్టి పెడుతున్నాయి. బ్యాగ్ లేని రోజులు, స్థానిక కళాకారులతో ఇంటర్న్‌షిప్‌లు, స్థానిక కళలు, చేతివృత్తులు, సంప్రదాయాలపై అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేకంగా చిన్నారుల ప్రారంభ దశలో ఆటలు, బొమ్మల ద్వారా నేర్చుకునే విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
మాతృభాషకు ప్రాధాన్యం
ప్రాథమిక దశలో పిల్లలకు అర్థమయ్యేలా మాతృభాష, స్థానిక లేదా ప్రాంతీయ భాషల్లో బోధన అందించడాన్ని కూడా పీఎం శ్రీ పాఠశాలలు ప్రోత్సహిస్తున్నాయి. 2025–26 తాజా UDISE+ గణాంకాల ప్రకారం పీఎం శ్రీ పాఠశాలల్లో 6,102 మంది సంస్కృత ఉపాధ్యాయులు, 1,994 మంది ఉర్దూ ఉపాధ్యాయులు, 9,152 మంది ప్రాంతీయ భాషా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. స్థానిక భాషల్లో బోధన ద్వారా పిల్లల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం మరింత బలపడేలా చర్యలు తీసుకుంటున్నారు.
సాంకేతికతతో ఆధునిక బోధన
పీఎం శ్రీ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఐసీటీ సదుపాయాలు, ఇంటర్నెట్, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, STEM ఆధారిత కార్యక్రమాలు వంటి సాంకేతిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో బోధన మరింత ఆసక్తికరంగా, అనుభవాత్మకంగా మారడంతో పాటు.. విద్యార్థుల్లో డిజిటల్ సాక్షరత, సాంకేతిక నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందే అవకాశం ఉంటుంది. దీక్షా వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు విద్యార్థులు, ఉపాధ్యాయులకు నాణ్యమైన డిజిటల్ విద్యా వనరులను అందిస్తున్నాయి.
చదువుతో పాటు.. సమగ్ర అభివృద్ధి
పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థుల అభివృద్ధిని కేవలం మార్కులు, పరీక్షలకే పరిమితం చేయడం లేదు. చదువుతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జీవన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలు కూడా అభివృద్ధి చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొనే విద్యా, వృత్తి, సామాజిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దడమే లక్ష్యం.
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ
పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయులు, పాఠశాల నాయకత్వం కీలకమని గుర్తించిన ప్రభుత్వం.. వారి నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. జిల్లా విద్యా, శిక్షణ సంస్థలు (DIETs) ద్వారా ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. ప్రతి DIETకు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల కోసం రూ.3 లక్షల వరకు, ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐసీటీ ఉపాధ్యాయులు, మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కోసం ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.2,500 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పాఠశాల భద్రత, మానసిక ఆరోగ్యం, విద్యార్థుల సంక్షేమం, కౌన్సెలింగ్, ఐసీటీ వినియోగం, సమగ్ర ప్రగతి కార్డులు వంటి అంశాల్లోనూ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నెట్‌వర్క్
ప్రస్తుతం 13,092 పీఎం శ్రీ పాఠశాలలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ పాఠశాలలు 725 జిల్లాలు, 8,340 బ్లాక్‌లు/పట్టణ స్థానిక సంస్థలను కవర్ చేస్తున్నాయి. ఎంపికైన 13,092 పాఠశాలల్లో 1,305 ప్రాథమిక పాఠశాలలు, 3,102 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3,141 మాధ్యమిక పాఠశాలలు, 5,544 ఉన్నత మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 80 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, 913 KVS పాఠశాలలు, 620 NVS పాఠశాలలు, 4 NCERT పాఠశాలలు కూడా ఉన్నాయి.
పాఠశాలల ఎంపిక ఎలా జరుగుతుంది?
పీఎం శ్రీ పాఠశాలల ఎంపిక ‘చాలెంజ్ మోడ్’ ద్వారా జరుగుతుంది. మొదటి దశలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంటాయి. రెండో దశలో UDISE+ డేటా ఆధారంగా నిర్దేశించిన కనీస ప్రమాణాలను పూర్తి చేసిన పాఠశాలలను గుర్తిస్తారు. మూడో దశలో అర్హత సాధించిన పాఠశాలలు చాలెంజ్ ఆధారిత ఎంపిక ప్రక్రియలో పాల్గొంటాయి. సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, KVS లేదా NVS అధికారులు పాఠశాలలను పరిశీలించి ప్రమాణాలు నెరవేరినట్లు నిర్ధారిస్తారు. అనంతరం ఎంపికైన పాఠశాలల జాబితాను కేంద్రానికి సిఫారసు చేస్తారు. చివరి ఎంపిక కోసం పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి అధ్యక్షతన నిపుణుల కమిటీ పనిచేస్తుంది. పాఠశాలకు పక్కా భవనం, సురక్షిత రాకపోకలు, భద్రతా చర్యలు, ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీరు, చేతులు కడుక్కునే సదుపాయం, విద్యుత్, లైబ్రరీ లేదా క్రీడా సదుపాయాలు వంటి కనీస ప్రమాణాలు తప్పనిసరి. చాలెంజ్ విధానంలో పట్టణ పాఠశాలలు కనీసం 70 శాతం, గ్రామీణ పాఠశాలలు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
పీఎం శ్రీ.. మార్పుకు మోడల్
మొత్తంగా చూస్తే.. పీఎం శ్రీ పథకం అంటే కేవలం పాఠశాలల్లో భవనాలు, మౌలిక వసతులు పెంచే కార్యక్రమం మాత్రమే కాదు. నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, సమ్మిళిత విద్య, సాంకేతికత, అనుభవాత్మక బోధన, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల సమగ్ర వికాసం వంటి అంశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం. జాతీయ విద్యా విధానం–2020లో నిర్దేశించిన లక్ష్యాలను పాఠశాల స్థాయిలో ఆచరణలోకి తీసుకురావడం ద్వారా.. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నైపుణ్యం, బాధ్యతాయుతమైన ఆలోచన కలిగిన విద్యార్థులను తయారు చేయడమే పీఎం శ్రీ పాఠశాలల ప్రధాన లక్ష్యం. ఇలాంటి పాఠశాలలు తమ పరిసర ప్రాంతాల్లోని ఇతర విద్యాసంస్థలకు కూడా ఆదర్శంగా నిలిచి, వాటి ఉత్తమ విధానాలను పంచుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో మరింత విస్తృతమైన మార్పుకు దోహదపడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.అంటే.. భవిష్యత్ భారతాన్ని నిర్మించే విద్యార్థులకు, నేటి నుంచే భవిష్యత్‌కు అవసరమైన విద్యను అందించడమే ‘పీఎం శ్రీ’ పథకం లక్ష్యం.