
న్యూఢిల్లీ: ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ సంస్థ అడిడాస్ (Adidas) భారత టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకుంది. గురుగ్రామ్‌లోని ఇండియా టెక్ హబ్‌లో దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారనే ఖచ్చితమైన సంఖ్యను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
గురుగ్రామ్ టెక్ హబ్‌లో సుమారు 700 మంది పనిచేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. వీరిలో సుమారు 300 నుంచి 350 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగాల కోతకు గురయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రభావిత ఉద్యోగుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది
ఉద్యోగులకు ఎప్పుడు సమాచారం?
సెప్టెంబర్ 15న నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో ఉద్యోగులకు పునర్వ్యవస్థీకరణ నిర్ణయాన్ని తెలియజేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రభావిత ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించినట్లు సమాచారం. కొందరికి ఎగ్జిట్ లెటర్లు అందగా, మరికొందరిని డిసెంబర్ వరకు కొనసాగించి ఇతర టెక్ హబ్‌లకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియలో భాగం చేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ఇతర అవకాశాలను వెతుక్కోవడానికి కూడా వారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
కంపెనీ ఏమంటోంది?
భారత్‌లోని టెక్నాలజీ సంస్థలో కొన్ని ఉద్యోగాలను తగ్గించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు అడిడాస్ ధృవీకరించింది. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆపరేటింగ్ మోడల్‌ను సర్దుబాటు చేసుకోవడం, సంస్థలోని కొన్ని విభాగాలను సరళీకృతం చేయడం, కీలక సామర్థ్యాలను బలోపేతం చేయడమే ఈ మార్పుల ఉద్దేశ్యమని కంపెనీ తెలిపింది. ప్రభావిత ఉద్యోగులకు ట్రాన్సిషన్ సపోర్ట్ అందిస్తామని పేర్కొంది. అయితే ఉద్యోగ కోతల ఖచ్చిత సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.
అడిడాస్‌కు గురుగ్రామ్‌లో ఇంజినీరింగ్ టెక్ హబ్ ఉంది. డిజిటల్ అనుభవాలు, ఈ-కామర్స్ కార్యకలాపాలకు ఈ హబ్ పనిచేస్తోంది. కంపెనీ అధికారిక కెరీర్ పేజీ ప్రకారం గురుగ్రామ్‌లో అడిడాస్‌కు టెక్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాగా, ఉద్యోగ కోతలపై మరిన్ని వివరాలు, ప్రభావిత ఉద్యోగుల సంఖ్య, పరిహారం, రీ-హైరింగ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కంపెనీ నుంచి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
మరిన్ని కెరీర్ & ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..