Reading Time: 2 minutes

నిజాం మెడలు వంచిన ఘనత సర్దార్ పటేల్‌‌ దే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Caption of Image.
  • చరిత్ర పునాదులపైనే ఉజ్వల భవిష్యత్తు
  • భావితరాలకు పోరాట వీరుల త్యాగాలు తెలియాలని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: ఉక్కుమనిషి సర్దార్ పటేల్ సంకల్పమే లేకుంటే భారత్‌‌లో తెలంగాణ ఉండేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. నిజాం నవాబు మెడలు వంచి సరెండర్ చేయించిన ఘనత సర్దార్ పటేల్‌‌దేనని ఆయన కొనియాడారు. అందుకే పటేల్ త్యాగాన్ని, ధైర్యాన్ని కూడా భావితరాలు స్మరించుకోవాలన్నారు.

 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌‌లోని పరేడ్ గ్రౌండ్స్‌‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌‌ను రాంచందర్ రావుతో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులతో కలిసి ప్రదర్శనను వీక్షించిన ఆయన, నిజాం నిరంకుశ పాలనపై సాగిన వీరోచిత పోరాట ఘట్టాలను స్వయంగా పిల్లలకు వివరించారు.

ఆపరేషన్ పోలోతో మోకరిల్లిన నిజాం..

అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. దేశమంతటికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే, హైదరాబాద్ సంస్థానానికి మాత్రం దాదాపు 13 నెలల తర్వాత 1948 సెప్టెంబరు 17న స్వేచ్ఛ లభించిందని గుర్తుచేశారు. దేశంలో కలవబోనంటూ మొండికేసిన నిజాం నవాబు దురహంకారాన్ని పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో పేరుతో తుత్తునియలు చేసి, నిజాంను పటేల్ ముందు మోకరిల్లేలా చేశారని అన్నారు.

ఆ చారిత్రక లొంగుబాటు దృశ్యాలను ఈ ఎగ్జిబిషన్ కళ్లకు కడుతోందని పేర్కొన్నారు. గురువారం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలంతా తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదన్నారు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. 

విమోచన వేడుకలకు వైస్ ప్రెసిడెంట్..

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌‌లో గురువారం జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి  ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. విశిష్ట అతిథిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తదితరులు హాజరుకానున్నారు.

©️ VIL Media Pvt Ltd.