
22A భూముల అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. సంచలన విషయాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని స్పష్టం చేస్తూ.. ధరణి వెనక సంచలన కుట్రను అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.
2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. 2018లో ధరణి అనే డిజిటల్ ఆన్ లైన్ పోర్టల్ తీసుకొచ్చారని.. అప్పటి మండలాల్లో ఉన్న భూ రికార్డులు అన్నీ జిల్లా కలెక్టర్ ఆఫీసులకు తరలించారని.. కలెక్టర్ ఆఫీసుల్లోని స్టోర్ రూముల్లో ఈ రికార్డులను ఉంచారన్నారు. భూముల వివరాలు డిజిటల్ పేరుతో ధరణిలోకి ఎక్కించే సమయంలో.. రికార్డులు మార్చేశారని.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు.. ప్రభుత్వ భూములను తమ పేరుతో మార్చుకున్నారని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.
2010లో ఒరిస్సా ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిందని.. 2014లో కాగ్ నివేదిక తప్పు పట్టిందని.. ఒరిస్సా ప్రభుత్వం చెత్తబుట్టలో వేసిన ధరణిని తీసుకొచ్చి.. అద్భుతం.. అమోఘం అంటూ కేసీఆర్ 2018లో తెలంగాణలో అమలు చేశారంటూ అసలు గుట్టు బయటపెడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వల్ల తెలంగాణలో 2 కోట్ల 50 లక్షల ఎకరాల భూముల వివరాలు అన్నీ విదేశాల్లోని మాఫియా చేతికి వెళ్లాయని.. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుట్రగా చెప్పుకొచ్చారు సీఎం. ధరణిని ILFS కంపెనీకి మొదటగా ఇచ్చారని.. ఆ తర్వాత టెర్రాస్ అనే కంపెనీకి కట్టబెట్టారన్నారు సీఎం. ఇప్పుడు ధరణిలోని భూముల వివరాలు అన్నీ బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్ లోని కేమెన్ ఐలాండ్స్ దగ్గర ఉన్నాయని.. ఆ దేశం మాఫియాలకు, బ్లాక్ మనీ గాళ్లకు అడ్డా అని.. అలాంటి మాఫియా వాళ్ల చేతుల్లో తెలంగాణ భూముల వివరాలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్.
ALSO READ : తెలంగాణలో 40 శాతం నిజాం భూములకు రికార్డులు లేవ్..
ధరణి అని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్.. ధరణి పేరుతో భారీ కుట్ర చేశారని.. విదేశీ మాఫియాకు తెలంగాణ భూముల వివరాలు ఇచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.