Reading Time: 2 minutes

ముంబై వీధుల్లో బిచ్చగాడిగా వేల కోట్ల సంపన్నుడు.. గుర్తుపట్టలేనంగా మారిపోయిన BJP ఎమ్మెల్యే?

Caption of Image.

వేల కోట్ల రూపాయల ఆస్తులున్న ఓ కుబేరుడు.. ఉన్నట్టుండి రోడ్డు మీద సాధారణ బిచ్చగాడిగా మారితే ఎలా ఉంటుంది? వినడానికే ఇది ఏదో సినిమా స్టోరీలా అనిపించినా.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది అక్షరాలా నిజమైంది. రాష్ట్రంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన బీజేపీ నేత, రియల్ ఎస్టేట్ దిగ్గజం అయిన పరాగ్ షా ఇటీవల చేసిన సాహసోపేతమైన ప్రయోగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  

ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న పరాగ్ షా.. తనకున్న భద్రతా సిబ్బంది, ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని ఒక్కరోజు పాటు పూర్తిగా పక్కన పెట్టారు. తన జైన ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ సూచన మేరకు ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారట. ఎవరూ తనను గుర్తుపట్టలేనంతగా మేకప్ వేయించుకుని.. అచ్చం బిచ్చగాడిలా ముంబై వీధుల్లో తిరిగారు.  

కొన్ని గంటల పాటు ఘట్కోపర్ రోడ్లపై తిరుగుతూ సామాన్యుల నుంచి భిక్షం అడగడమే కాకుండా.. రోడ్డు పక్కన కూర్చుని దొరికిన ఆహారాన్ని తిన్నారు. దీని ద్వారా మనుషుల నిజస్వరూపాన్ని, జీవిత సత్యాన్ని తెలుసుకున్నానని చెప్పారు. మనకు హోదా ఉన్నప్పుడు లైన్లో నిలబడి మరీ గౌరవం ఇస్తారు. కానీ ఆ గుర్తింపు లేనప్పుడు మనుషుల ప్రవర్తన ఎలా మారుతుందో ఈ అనుభవం కనువిప్పు కలిగించిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఈ ప్రయాణంలో ముంబై ప్రజల గొప్ప మనసును తాను దగ్గరుండి చూశానని పరాగ్ షా వెల్లడించారు. ఓ సాధారణ వ్యక్తి తనకు రూ.20 ఇచ్చి భోజనం చేయమన్నాడని, అలాగే ఓ చిన్న సమోసా వ్యాపారి తన వద్ద డబ్బులు లేవని చెప్పినా ఎలాంటి మొఖం చిట్లించకుండా నవ్వుతూ సమోసా పెట్టాడని తన అనుభవాలను పంచుకున్నారు. తరువాత తన మేకప్ తొలగించి అసలు రూపంలోకి వచ్చి మళ్లీ అదే వ్యక్తులను కలిసి వారి స్పందనలను గమనించారు బీజేపీ ఎమ్మెల్యే.

గత 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ.3వేల 383 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించి రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచిన పరాగ్ షా.. ఇలా కొన్ని గంటలు బిచ్చగాడిలా గడపడం అందరినీ విస్మయానికి గురిచేసింది. డబ్బు, అధికారంతో వచ్చే గౌరవం శాశ్వతం కాదనే ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిన ఈ రియల్ ఎస్టేట్ కుబేరుడి ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

©️ VIL Media Pvt Ltd.