
న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా రూ.2 వేల కంటే ఎక్కువ చేసే చెల్లింపులపై వ్యాపారులకు 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) విధించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నాయి. ఎండీఆర్ వల్ల చిన్న, విధి వ్యాపారులతో పాటు చివరకు వినియోగదారులపైన భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎండీఆర్ విధింపుపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు మరోసారి క్లారిటీ ఇచ్చాయి. సుదీర్ఘ చర్చలు, పరిశీలన తర్వాత ఎండీఆర్ విధింపుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారులపై మోపకుండా ఉండేందుకు ఎండీఆర్ అమలును ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తుందని పేర్కొన్నాయి.
‘‘ఎండీఆర్ అమలులో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ప్రభుత్వం పేమెంట్ అగ్రిగేటర్లతో చర్చలు జరిపింది. వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారులపై మోపకుండా ఉండేందుకు సమర్థవంతమైన అమలును ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తుంది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఎండీఆర్ అమలు చేస్తోందన్న ప్రతిపక్షాలు ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశాయి. ఎండీఆర్ అమలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి లేదని వివరణ ఇచ్చాయి. అలాగే, యూపీఐ వినియోగదారులపైన వస్తు సేవల పన్ను (GST) అనేది ఒక తప్పుడు వదంతి అని ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
దేశంలో చిరువ్యాపారి మొదలు బడా మాల్స్ వరకు నగదు రహిత చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకున్నది. గడిచిన ఆరేళ్లుగా సాగిన పూర్తి ఉచిత సేవలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెద్ద మొత్తంలో జరిగే వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రుసుమును విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఎప్పటిలాగే పర్సన్ టు పర్సన్ (పీ2పీ) యూపీఐ లావాదేవీలను ఉచితంగానే కొనసాగించవచ్చని పేర్కొన్నది. అలాగే, పీ2పీతో పాటు రూ.2వేలలోపు వ్యాపార చెల్లింపులు (ప్రీ టు ఎం) ఎండీఆర్ పరిధిలోకి రావని స్పష్టంచేసింది.
ఏమిటీ ఎండీఆర్..?
డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహించే బ్యాంకులు, నెట్వర్క్ సంస్థలకు వ్యాపారులు చెల్లించే రుసుమును ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అంటారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2020 నుంచి యూపీఐకి ఎండీఆర్ మినహాయింపు ఇచ్చారు. అయితే, ప్రతినెలా బిలియన్ల కొద్దీ లావాదేవీలు జరుగుతుండటంతో సెక్యూరిటీ, సర్వర్ల నిర్వహణ భారంగా మారిందని బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వాదిస్తున్నాయి. దీంతో పెద్దమొత్తంలో జరిగే లావాదేవీలపై పరిమితంగా ఎండీఆర్ విధించే అంశంపై ఎన్పీసీఐ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది.
►ALSO READ | PF వేతన పరిమితి పెంపు: ఉద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ రూ.10లక్షల 50వేలు అవనుందా!
నిత్యావసర రంగాలు, సేవలపై ఫ్లాట్ చార్జీ
రైల్వే టికెట్లు, టెలికాం రీచార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పెట్రోల్/డీజిల్ బంకుల్లో చెల్లింపులు, విత్తనాలు, -ఎరువుల కొనుగోళ్లకు ప్రత్యేక రాయితీ కల్పించారు. వీటిలో రూ.2 వేలు దాటిన లావాదేవీలపై శాతంతో పనిలేకుండా ఫ్లాట్గా రూ.5 మాత్రమే చార్జీ విధిస్తారు. విద్యుత్, నీరు, గ్యాస్ంటి ప్రభుత్వ యుటిలిటీ బిల్లులు, పాఠశాలలు-, విశ్వవిద్యాలయాల ఫీజుల చెల్లింపులకూ ఇదే రూ.5 నిబంధన వర్తిస్తుంది. ఇక, మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లకు చేసే చెల్లింపులపై నామమాత్రపు 0.02 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. దీని గరిష్ట పరిమితి రూ.300. అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, స్టాక్ బ్రోకర్లు, షేర్ల కొనుగోలు, డెట్ మార్కెట్, బ్రోకర్ వాలెట్ టాప్-అప్ల కోసం చేసే లావాదేవీలు ఈ పరిధిలోకి వస్తాయి