
యూకే వీసా, ఉద్యోగాల పేరుతో సాగిన కోట్ల రూపాయల మోసం వ్యవహారంలో ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్స్ రమా నందన దంపతుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లండన్ మోసాల నెట్‌వర్క్‌లో నిందితురాలిగా ఉన్న ఆమె.. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గుట్టు చప్పుడు కాకుండా విచారణకు హాజరుకావడం తీవ్ర కలకలం రేపింది.
బుధవారం విచారణకు రావాల్సి ఉండగా.. బాధితులు, మీడియా కంట పడకుండా ఒకరోజు ముందుగానే మంగళవారమే రహస్యంగా హాజరై వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణియం నేతృత్వంలో దాదాపు30 నిమిషాల పాటు ఆమెను ప్రశ్నించారు. అయితే ఈ కేసులో అసలు నిజాలు రాబట్టడంలో పోలీసులు గోప్యత పాటిస్తూ నిందితురాలికి సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో యూకే వీసా పునరుద్ధరణ, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి శివక్రాంతి కుమార్ అనే బాధితుడి నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్నాక నకిలీ స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ (CoS) ఇచ్చి ముంచేశారని, బాధితుడు నిలదీస్తే బెదిరింపులకు దిగారని ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో నందనతో పాటు ఆమె భర్త జగార్లమూడి మధుకర్ కూడా కీలక పాత్రధారిగా ఉన్నాడు.
ALSO READ : డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌తో వస్తున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్
విచారణలో ‘నాకేం తెలియదు, అంతా నా భర్తకే తెలుసు’ అని దాటవేత ధోరణిలో నందన ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ‘తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసులు (LOC) ఎత్తివేసి లండన్ వెళ్లేందుకు అనుమతిస్తే, నెల రోజుల్లో భర్తను ఇండియాకు పంపుతాను’ అని కోరడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. సెప్టెంబర్ 8న విచారణలో కూడా ఆమె సరిగా సహకరించకపోవడంతో పోలీసులు మళ్లీ పిలిపించారు.
అయితే లండన్ వెళ్లేందుకు నందన వ్యూహాలు పారుతాయా? లేక బాధితులకు న్యాయం జరుగుతుందా? అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి చర్యలు ఏమిటి? మధుకర్ ను లండన్ నుంచి తీసుకువస్తారా? ఇంకా ఈ కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.