Reading Time: 2 minutes
Faah Viral Sound Origin Venumadhav Keerthi Vasan

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘ఫాహ్..’ (Faah) అనే ఒక విచిత్రమైన సౌండ్ బాగా ట్రెండ్ అవుతోంది. విఘ్నేష్ శివన్ లాంటి టాప్ డైరెక్టర్ల సినిమాల్లో కూడా ఈ సౌండ్ వినిపించడం దీనికి ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. ఇంతకీ ఈ సౌండ్ ఎక్కడి నుంచి పుట్టింది? దీని వెనుక ఉన్న కథ ఏంటని తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపించారు. అయితే, ఈ వైరల్ సౌండ్ పుట్టుక వెనుక ఉన్నది మన టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ దివంగత శ్రీ వేణుమాధవేనని ప్రముఖ తమిళ వాయిస్ ఆర్టిస్ట్ కీర్తి వాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన నిజం బయటపెట్టారు. రీసెంట్‌గా వీజే మోహనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి వాసన్ ఈ ‘ఫాహ్..’ సౌండ్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “ఈ ఫాహ్ అనే సౌండ్ ఎలా వచ్చింది?” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. “ఈ సౌండ్ నాది కాదు, ఇది తెలుగులో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన గొప్ప నటుడు వేణుమాధవ్ ది. ఆయన వాయిస్ చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆయన వాయిస్‌లో ఉన్న ఒక రకమైన డిఫరెంట్ టోన్ వల్ల, అప్పట్లో నేను డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన కొత్తలో వేణుమాధవ్ పాత్రలకు డబ్బింగ్ చెప్పేవాడిని.” అని కీర్తి వాసన్ చెప్పుకొచ్చారు.

వేణుమాధవ్ ట్రేడ్ మార్క్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ గురించి కీర్తి వాసన్ వివరిస్తూ.. “ఆయన తన సినిమాల్లో ఏదైనా ఆశ్చర్యమైనా, ఇంకేదైనా ఫీలింగ్ అయినా ‘వాహ్.. అరే.. వాహ్’ అని చాలా ఎనర్జిటిక్‌గా అంటుండేవారు. అదే సౌండ్ తమిళంలోకి వచ్చేసరికి ‘ఫాహ్..’ గా మారింది. నేను దాన్ని మరింత ఫన్నీగా ‘డా.. ఊ.. ఫాహ్.. సూపర్ ఫాహ్..’ అంటూ చెప్పడం మొదలుపెట్టాను. ఆ ఫ్లోలో ఆ సౌండ్ అలా వెళ్లిపోయింది. ఇప్పుడు తమిళంలో, తెలుగులో ఇలా చాలా మంది ఈ ‘ఫాహ్’ అనే సౌండ్‌ను వాడుతున్నారు. కానీ దీనికి అసలైన కాపీరైట్స్ ఓనర్ మాత్రం వేణుమాధవ్ గారే” అని ఆయన అసలు నిజాన్ని బయటపెట్టారు. మన తెలుగు కమెడియన్ వేణుమాధవ్ గారి ఒక ట్రేడ్ మార్క్ సౌండ్, ఇప్పుడు కోలీవుడ్ నుంచి మొదలుకొని సోషల్ మీడియా అంతటా ఈ రేంజ్‌లో వైరల్ కావడం, ఆయన ప్రతిభకు, ఆయన మనపై వదిలివెళ్లిన ఇంపాక్ట్‌కు ఒక నిదర్శనం.