
కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ గా18 మందితో కూడిన కొత్త పాలకవర్గాన్ని ప్రకటించింది. శశి శేఖర్ వేంపటి ఛైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ నూతన బోర్డులో టాలీవుడ్ నుంచి కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు అత్యంత ప్రతిష్టాత్మక స్థానం దక్కింది. దీంతో పలువురు సినీ ప్రముఖుులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ అభినందిస్తున్నారు.
అక్కినేని వారసురాలిగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సుప్రియ.. ఆ తర్వాత మేకప్‌కి కాస్త విరామమిచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ బిజినెస్ అండ్ ప్రొడక్షన్ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కేవలం బ్యాక్‌స్టేజ్ ఆపరేటర్ గానే కాకుండా.. ‘గూఢచారి’లో సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చి నటిగానూ మెప్పించారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబోలో ‘డాకోయిట్’ నిర్మాణంతో వార్తల్లో నిలిచారు. ప్రొడక్షన్ కష్టనష్టాలు, సినిమా మేకింగ్ నరనరాన తెలిసిన సుప్రియ రాకతో, సెన్సార్ బోర్డులో టాలీవుడ్‌కి బలమైన ప్రాతినిధ్యం లభించినట్లయింది.
ఈ కొత్త బోర్డుకి శశి శేఖర్ వేంపటి ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, సభ్యుల జాబితాలో సుప్రియతో పాటు సునీల్ శెట్టి, ప్రీతి జింటా, ప్రసిద్ధ దర్శకుడు ప్రియదర్శన్, పంకజ్ త్రిపాఠి, పల్లవి జోషి, బెంగాలీ సూపర్ స్టార్ ప్రోసేన్‌జిత్ ఛటర్జీ, టీవీ క్వీన్ రూపాలీ గంగూలీ, గ్రామీ విజేత మ్యూజిషియన్ రిక్కీ కేజ్, విలక్షణ నటుడు మనోజ్ జోషి లకు స్థానం లభించింది.
ఈ కొత్త కమిటీ సినిమాట్రోగ్రఫీ చట్టం ప్రకారం మూడేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. వీరు భారతీయ చిత్రసీమకు సరికొత్త దిశానిర్దేశం చేయనున్నారు. దశాబ్దాల సినీ అనుభవం, నిర్మాణ రంగంలో ఉన్నతమైన పట్టు ఉన్న సుప్రియ యార్లగడ్డ ఈ స్థానానికి ఎంపికవ్వడం పట్ల టాలీవుడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాయి..