
Saudi Arabia: మధ్యప్రాచ్యంలో యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియాల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. హౌతీలు సౌదీలోని కీలక నగరాలు, ఆయిల్ స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ముస్లింల పవిత్ర నగరం మక్కాపై డ్రోన్ దాడులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, తాజాగా హౌతీలు సంచలన ప్రకటన చేశారు. సౌదీకి చెందిన F-15 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని హూతీలు ప్రకటించారు. మారిబ్ ప్రావిన్స్ గగనతలంలో సౌదీ యుద్ధ విమానం తమపై దాడులకు పాల్పడుతుండగా దాన్ని కూల్చినట్లు హూతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ తెలిపారు. అయితే, దీనిపై సౌదీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తమ బలగాలు స్థానికంగా తయారుచేసిన ఎయిర్ టూ ఎయిర్ క్షిపణితో సౌదీ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు హౌతీ ప్రతినిధి చెప్పారు. ఈ యుద్ధ విమానంతో మారిబ్ ప్రాంతంతో సౌదీ సైనిక మోహరింపుకు మద్దతుగా శత్రు చర్యలు నిర్వహిస్తోందని ఆరోపించారు. యెమెన్‌లోని పలు ప్రాంతాలపై సౌదీ బలగాలు 450 వైమానిక దాడులు నిర్వహించినట్లు యహ్యాసరీ ఆరోపించారు.
ఇదిలా ఉంటే, మక్కాపై హౌతీలు దాడులు చేశారనే వార్తల్ని యహ్యాసరీ ఖండించారు. తమ సైనిక చర్య కేవలం సౌదీ చమురు మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపైనే అని, మక్కా ఇతర పవిత్ర స్థలాలపై కాదని హౌతీలు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15న మక్కాకు దక్షిణంగా వచ్చిన డ్రోన్‌ను సౌదీ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం ప్రకటించింది.