Reading Time: 2 minutes

కిచెన్ బడ్జెట్‌ తలకిందులు: ఉల్లి నుంచి వంటనూనె వరకూ భగ్గుమంటున్నాయ్.. తిండికి తిప్పలే!

Caption of Image.

భారతదేశంలో ప్రతి ఇంటి వంటగది బడ్జెట్‌ను పెరిగిన ఆహార ధరలు తలకిందులు చేశాయి. సామాన్యుడి నిత్య జీవితంలో భాగమైన సాంప్రదాయ భోజనం ఖర్చు భారీగానే పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులో దాదాపు సగం, పట్టణాల్లో దాదాపు 40 శాతం వరకు కేవలం ఆహారం మీదే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రతిరోజూ వాడే ఉల్లిపాయల ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 50 శాతం పెరగగా, అల్లం రేటు ఏకంగా 70 శాతానికి పైగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా దేశంలో వర్షపాతం తగ్గడమే కారణమని చెప్పవచ్చు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. ఎల్నినో ప్రభావం కారణంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా.. వరి, సోయాబీన్స్, మొక్కజొన్న, చెరకు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు ప్రభుత్వం బయోఫ్యూయల్ కోసం ఇథనాల్ ఉత్పత్తిని పెంచటంతో మొక్కజొన్న, బియ్యం ఇంధన తయారీకి మళ్లించటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా క్రూడ్, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.  

ఆహార ధరల మంట ప్రజల ఉపాధిని కూడా దెబ్బతీస్తోంది. చికెన్ షాపు ఓనర్ల నుంచి చిన్న హోటళ్లు, రెస్టారెంట్ల యజమానుల వరకు అందరూ పెరుగుతున్న సరుకులు, LPG గ్యాస్ ధరలతో సతమతమవుతున్నారు. వినియోగదారులపై భారం పడకూడదని ధరలు పెంచలేక, నష్టాలను భరించలేక చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో పండుగ సీజన్ వస్తుండటంతో.. పిండి వంటలు, మిఠాయిలకు డిమాండ్ పెరిగి ధరలు మరింత దూసుకెళ్లే ప్రమాదం ఉంది.  

ఆహార ధరల దూకుడు కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం RBI నిర్దేశిత లక్ష్యాలను దాటిపోతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారతీయ సెంట్రల్ బ్యాంక్ అమెరికా బాటలోనే త్వరలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యుడి జేబుకు అదనంగా చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. మెుత్తానితి ఒకపక్కన ఆదాయాలు పెరగకపోవటం, మరోపక్క ఏఐ ఎఫెక్ట్ వల్ల ఉన్న జాబ్స్ పోవటంతో ప్రజలు కనీసం కడుపు నిండా కూడా తిండి తినలేని పరిస్థితి ఏర్పడింది ధరల భారంతో. 

©️ VIL Media Pvt Ltd.