
నల్గొండ, వెలుగు: నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామంలో 2 వేల ఏండ్ల నాటి టెర్రకోట డాబర్ ఆనవాళ్లు, కాకతీయ ద్వికూటాలయం, శాసనం వెలుగుచూశాయి. మంగళవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు చిక్కుల యాదగిరి, మేక అశోక్ రెడ్డికి 2 వేల ఏండ్లనాటి టెర్రకోట డాబర్ లభించింది.
కుండలు చేసేందుకు ఉపయోగించే ఈ మట్టి పరికరం అప్పాజీపేట ఊరి చివర వడ్లవారిపాడులో, దోమలపల్లి వెళ్లే రహదారి సమీపంలో చెలకలో లభ్యమైంది. చరిత్రబృందం సభ్యులు ఇచ్చిన సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్ వివరాలు వెల్లడించారు.
ఈ టెర్రకోట డాబర్ ను కుండలు చేసేటపుడు లోపల వైపు పెట్టుకొని పైనుంచి మరో చెక్కబద్దతో కొడుతూ కుండకు ఆకారాన్ని ఇస్తారన్నారు. ఇటువంటి టెర్రకోట డాబర్స్ ఇండోర్ ఖెరాలో దొరికాయని, అవి క్రీ.పూ200 సంవత్సరాల నుంచి క్రీ.శ.600 సంవత్సరాల వరకు వయసు కలిగి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ టెర్రకోట లభించిన చోట శాస్త్రీయంగా పరిశోధనలు చేస్తే మరిన్ని చారిత్రక పురాతన వస్తువులు దొరికే అవకాశం ఉందని తెలిపారు.