
సౌత్ నుండి ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. రీజనల్ మూవీస్ గల్లాపెట్టే నింపుకోగలిగాయి. టాలీవుడ్ నుండి మన శంకర్ వరప్రసాద్ గారు దగ్గర నుండి ఇరుముడి వరకు, కోలీవుడ్‌లో కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్, డీసీ, మాలీవుడ్‌లో వాజా2, దృశ్యం3, బెత్లెహం కుడుంబ యూనిట్ వంద కోట్ల నుండి మూడు వందల కోట్ల వరకు కలెక్షన్ రాబట్టుకున్నాయి. కానీ కన్నడ ఇండస్ట్రీ మాత్రం రీజనల్ లెవల్లో వంద కోట్లు టచ్ చేయడానికి నానా అవస్థలు పడుతోంది.
గత ఏడాది శాండిల్ వుడ్ చూపించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కాంతార చాప్టర్ వన్ పాన్ ఇండియా లెవల్లో రిలీజై కోట్లు కొల్లగొట్టింది. రూ. 800 కోట్ల గ్రాస్‌కు పైగా రాబట్టుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యానిమేషన్ మైథాలజీ ఫిల్మ్ మహావతార్ నరసింహా ఏకంగా రూ. 300 కోట్లు క్రాస్ చేసి ట్రేడ్స్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఇక రీజనల్ ఫిల్మ్ సు ఫ్రం సో ఎవ్వరూ ఊహించని విధంగా వంద కోట్లు కొల్లగొట్టింది. కానీ ఈ ఏడాది ఎందుకో శాండిల్ వుడ్ వెనకబడింది. ఈ ఏడాది గడిచి ఎనిమిది నెలలైనా శాండిల్ వుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. అందరి అంచనాలను తల్లకిందులు చేసేసింది పాన్ వరల్డ్ ఫిల్మ్ టాక్సిక్. ఇక రీజనల్ మూవీల సంగతి చెప్పనక్కర్లేదు. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా వంద కోట్లు కాదు కాదు రూ. 50 కోట్లు కూడా రీచ్ కాలేదు. సుదీప్, ఉపేంద్ర, రిషబ్ లాంటి స్టార్స్ బాక్సాఫీస్ స్కిప్ చేయడం కూడా శాండిల్ వుడ్ బాక్సాఫీస్ బోసిపోతుంది. మరీ నెక్ట్స్ మూడు నెలల్లోనైనా చందన సీమ కోలుకుంటుందో లేదో చూడాలి.