
- 50 స్కూళ్లలో ‘జనరేషన్ గ్లోబల్’
- 20 స్కూళ్ల టీచర్లకు ‘నానో’ ప్రొఫెషనల్ లెర్నింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సర్కారు స్కూళ్ల విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్‌పోజర్, ఆధునిక విద్యా పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ విద్యా సంస్థ ‘ఇంటర్నేషనల్ బాకలారియాట్ ఆర్గనైజేషన్’ (ఐబీవో)తో విద్యాశాఖ భాగస్వామ్య ఒప్పందం (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్‌ఓఐ) కుదుర్చుకుంది. సీఎం ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ సమక్షంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, మోడల్ స్కూల్స్ ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి, ఐబీవో డైరెక్టర్ జనరల్ ఒల్లీ–పెక్కా హైనోనెన్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
50 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు
ఒప్పందంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 మోడల్ స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ‘జనరేషన్ గ్లోబల్’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 9, 11 తరగతుల్లో చదువుతున్న 13 నుంచి 17 ఏండ్ల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ఆధునిక ఆన్‌లైన్ లెర్నింగ్ రిసోర్సెస్, డైలాగ్ ఆధారిత అభ్యాస అవకాశాలను కల్పించనున్నారు. తద్వారా విద్యార్థుల్లో సమకాలీన అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచడంతో పాటు విశ్లేషణాత్మక ఆలోచన, సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు.
టీచర్లకూ అంతర్జాతీయ శిక్షణ
విద్యార్థులతో పాటు టీచర్ల బోధనా నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. ఎంపిక చేసిన 20 మోడల్ స్కూళ్ల టీచర్లకు ‘టీచర్ నానో ప్రొఫెషనల్ లెర్నింగ్’ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఒక్కొక్కటి 90 నిమిషాల వ్యవధితో ఆరు ప్రత్యేక మాడ్యూల్స్ ఉంటాయి. ‘జనరేషన్ గ్లోబల్ టీచర్ ఇంట్రడక్షన్ టు డైలాగ్’ కోర్సు పూర్తి చేసిన టీచర్లకు అంతర్జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్ రికగ్నిషన్ కల్పించనున్నారు. తొలి దశలో అవసరమైన లెర్నింగ్ రిసోర్సెస్, ప్రొఫెషనల్ ట్రైనింగ్, సాంకేతిక సహకారాన్ని ఐబీవో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అందించనుంది.