Reading Time: 2 minutes

రాజస్థాన్ మున్సిపల్ రిజల్ట్స్.. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ.. సొంత ఇలాకాలో సీఎంకు షాక్..!

Caption of Image.

జైపూర్: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని ముందంజలో నిలువగా అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది. మొత్తం 309 పురపాలక సంస్థలలోని 10,245 వార్డులకు ఎన్నికలు జరగగా.. 4,100 కి పైగా వార్డులలో బీజేపీ విజయం సాధించింది.

3,400కి పైగా వార్డులను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇండిపెండెంట్లు ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తూ దాదాపు 2,400కి పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు. ఓట్ షేర్ పరంగా చూస్తే.. 309 పురపాలక సంస్థలలో పోలైన మొత్తం ఓట్లలో కాంగ్రెస్ 34.24 శాతం (36,35,952 ఓట్లు) సాధించగా.. బీజేపీ 35.18 శాతం (37,35,567 ఓట్లు) దక్కించుకుంది.

దీంతో బీజేపీ కేవలం 0.94 శాతం (99,615 ఓట్లు) స్వల్ప ఆధిక్యం సాధించడం గమనార్హం. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 27.38 శాతం (29,06,787 ఓట్లు) ఓట్లతో గణనీయమైన వాటాను దక్కించుకున్నారు. నోటాకు 1.03 శాతం (1,09,523 ఓట్లు) ఓట్లు పడ్డాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్, కోటా మున్సిపల్ కార్పొరేషన్, జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్, సుకేత్ మున్సిపాలిటీలలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 

కీలక నేతలకు షాక్:

రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగుంటిలో బీజేపీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. బికనీర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు కంచుకోటగా భావించే ఝలావర్ మున్సిపల్ కార్పొరేషన్‎లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్వస్థలమైన భరత్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 65 వార్డులకు గాను 36 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం రాజస్థాన్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అసెంబ్లీ నియోజకవర్గమైన టోంక్‌లో కూడా కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసింది. టోంక్ నగర పరిషత్‌లోని 60 వార్డులకు గాను 59 వార్డులకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 32 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 19, స్వతంత్రులు ఎనిమిది స్థానాలను దక్కించుకున్నారు. జోధ్‌పూర్‌ మున్సిపల్ కార్పొరేషన్‎లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సొంత వార్డులో బీజేపీ విజయం సాధించగా.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సొంత వార్డులో కాంగ్రెస్ గెలుపొందడం విశేషం. 

 

©️ VIL Media Pvt Ltd.