
ఒక చిన్న వెబ్‌సైట్‌లో మీ ఖాతా వివరాలు లీక్ అయితే ఏం జరుగుతుంది? అక్కడ ఉపయోగించిన పాస్‌వర్డ్‌నే మీరు ఇతర ఖాతాల్లోనూ పెట్టి ఉంటే సమస్య మరింత పెద్దదవుతుంది. సైబర్ నేరగాళ్లు అదే పాస్‌వర్డ్‌తో ఇతర ఖాతాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. దీంతో వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక వివరాల వరకు ఎన్నో అంశాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
ఒక్క పాస్‌వర్డ్‌తో అన్నీ పోయే ప్రమాదం..
మీరు ఉపయోగించే ఏదైనా చిన్న వెబ్‌సైట్ డేటా లీక్‌కు గురైందని అనుకుందాం. అక్కడ మీ పాస్‌వర్డ్ నేరగాళ్ల చేతికి చిక్కితే, అదే వివరాలతో జీమెయిల్, సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇతర సేవల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు సమస్య వ్యాపించడాన్ని డొమినో ప్రభావంగా చెప్పవచ్చు.
ముఖ్యంగా బ్యాంకింగ్, UPI సేవలకు కూడా ఇదే పాస్‌వర్డ్ ఉపయోగిస్తే ఆర్థిక నష్టం జరిగే ముప్పు ఉంటుంది. సామాజిక మాధ్యమ ఖాతాలు స్వాధీనం చేసుకున్న తర్వాత మీ పేరుతో స్నేహితులకు సందేశాలు పంపి డబ్బులు అడిగే మోసాలు కూడా జరగొచ్చు. వ్యక్తిగత ఫొటోలు, ప్రైవేట్ సంభాషణలు, అధికారిక ఈమెయిల్స్ బయటపడితే గోప్యతకు తీవ్ర భంగం కలిగే అవకాశం ఉంది.
బలమైన పాస్‌వర్డ్ కోసం..
ప్రతి ఖాతాకు ప్రత్యేకమైన పాస్‌వర్డ్ పెట్టుకోవడం అత్యంత ముఖ్యమైన జాగ్రత్త. సులభంగా ఊహించగలిగే పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లు వంటివి ఉపయోగించకపోవడం మంచిది. గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండే పదాల సమూహంతో పొడవైన పాస్‌ఫ్రేజ్ రూపొందించుకోవచ్చు.
పాస్‌వర్డ్‌లో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులను కలపాలి. ఇలా చేయడం వల్ల ఊహించి ఛేదించడం కష్టమవుతుంది. ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవడం కష్టమైతే Google Password Manager, Bitwarden వంటి నమ్మకమైన పాస్‌వర్డ్ నిర్వహణ సాధనాలను ఉపయోగించవచ్చు. సౌకర్యం కోసం ఒకే పాస్‌వర్డ్ పెట్టడం కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇప్పటికీ అన్ని ఖాతాలకూ ఒకే పాస్‌వర్డ్ వాడుతున్నట్లయితే వెంటనే మార్చడం మంచిది.