Reading Time: 2 minutes
బాంకే బిహారీ ఆలయంలో కలకలం.. బృందావన్‌లోని శ్రీకృష్ణుడి వెండి రథం మాయం..!

బృందావన్‌లోని ప్రసిద్ధ ఠాకూర్ శ్రీ బాంకే బిహారీ ఆలయంలో 200 కిలోల వెండి రథం చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. శ్రీకృష్ణుని రాసయాత్రతో ముడిపడిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది జరిగే రథయాత్రలో ఈ వెండి రథాన్ని ఉపయోగించేవారు. అయితే ఈ ఏడాది రథయాత్రలో రథాన్ని వినియోగించకపోవడంతో వివాదం మొదలైంది. అనంతరం రథం కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు ఆలయ యాజమాన్యం, సేవాయత్‌ల మధ్య విభేదాలకు దారితీశాయి. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో పాటు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

పరిస్థితిని పరిశీలించేందుకు ఉన్నతాధికారుల నిర్వహణ కమిటీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 13)బృందావన్ సీఓ సందీప్ సింగ్, అదనపు నగర మేజిస్ట్రేట్ రామ్‌ప్రసాద్ త్రిపాఠి పోలీసులతో కలిసి గోస్వామి జ్ఞానేంద్ర గోస్వామి, బ్రిజేంద్ర కిషోర్ గోస్వామి నివాసానికి వెళ్లారు. వెండి రథంతో పాటు దానికి సంబంధించిన సామగ్రిని చూపించాలని అధికారులు కోరారు. అయితే లిఖితపూర్వక నోటీసు లేకుండా వస్తువులను అప్పగించలేమని అక్కడి సిబ్బంది స్పష్టం చేసినట్లు సమాచారం.

దీంతో పరిపాలన అధికారులు అధికారిక నోటీసు జారీ చేశారు. వెండి వస్తువుల భద్రత, భక్తుల నుంచి వచ్చిన విరాళాల రసీదులు, రథం యాజమాన్యానికి సంబంధించిన ఆధారాలు, ప్రస్తుతం రథం ఎక్కడ ఉందనే వివరాలను సమర్పించాలని సేవాయత్‌లను ఆదేశించారు. ఈ రథంలో సుమారు 160 కిలోల వెండి ఉన్నట్లు సమాచారం. కలప, ఇతర సామగ్రితో కలిపి మొత్తం బరువు దాదాపు 200 కిలోలుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు సేవాయత్ జ్ఞానేంద్ర గోస్వామి మాత్రం ఈ రథం ఆలయ ఆస్తి కాదని చెబుతున్నారు. తన తండ్రి స్థాపించిన ట్రస్టుకు భక్తులు విరాళంగా ఇచ్చిన రథమని ఆయన వాదిస్తున్నారు. 2013 నుంచి రథయాత్రలో దీనిని ఉపయోగిస్తున్నామని, అయితే ఈసారి ఆలయ రెయిలింగ్, కమిటీ సహకారం లేకపోవడంతో రథయాత్రలో చేర్చలేకపోయామని పేర్కొన్నారు. అధికారులు తనిఖీకి రావడంపై గోస్వామి సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ కమిటీ అధికార పరిధిని ప్రశ్నిస్తూ, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతోంది.

ప్రస్తుతం ఈ వివాదంలో ప్రధానంగా మూడు ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. 200 కిలోల వెండి రథానికి చట్టపరంగా అసలు యజమాని ఎవరు? రథం ప్రస్తుతం ఎక్కడ ఉంది? దాని సంరక్షణ బాధ్యత ఎవరిది? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. రథం యాజమాన్యం, విరాళాలు, వినియోగం, భద్రత తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే రథానికి సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..