దేశం, రాష్ట్రం సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామిని సీఎం చంద్రబాబు ప్రార్థించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఏం తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధి లో ముందుండేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న సీఎం టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. టిటిడి పనితీరు అభినందించారు. ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని రాబోయే తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించిన సీఎం అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టు వస్త్రాల తో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రలు స్వాగతం పలకగా ధ్వజస్తంభానికి నమస్కరించిన సీఏం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో సీఎం చంద్రబాబు కుటుంబాన్ని ఆశీర్వదించగా టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది 2027కు సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు అనంతరం ప్రభుత్వాలు మొదటి రోజు తొలి వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి పెద్దశేష వాహన సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పెద్దశేష వాహన సేవలో సీఎం పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం వెంట రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మానవ వనరులు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ పాలక మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడసీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభంగా తొలిరోజు రాత్రి జరిగిన పెద్దశేష వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామి దర్శన మిచ్చారు. ఆదిశేషుని ప్రతిరూపమైన పెద్దశేషునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలో కళాబృందాల కనువిందు చేసాయి. 9 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలు, 549 మంది కళాకారుల ఆటపాటల సందడి చేసాయి.
ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు తమ ప్రాంతాల్లోని సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. వివిధ రాష్ట్రాల జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనం భక్తులకు కనువిందు చేయగా తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ కుట్రాల కురవంజి తొలిరోజు కళా ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాసుడు పద్మావతి పరిణయాన్ని ప్రతిబింబించే కథాంశాన్ని నృత్యం, సంగీతం, అభినయంతో కళాకారులు ఆవిష్కరించారురంగురంగుల సంప్రదాయ ఆహార్యంతో కళాకారుల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక బిహూ నృత్యంతో అస్సాం సంస్కృతి వైభవాన్ని బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర కళాకారులు చాటి చెప్పారు.
అస్సాం రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక బిహూ నృత్యం భక్తులను అలరించింది. సంప్రదాయ వస్త్రధారణలో యువతీ యువకులు జంటలుగా ఉత్సాహభరితంగా చేసిన వేగవంతమైన చేతులు, నడుము, పాదాల కదలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహూ గీతాల లయకు అనుగుణంగా సాగిన ఈ ప్రదర్శన ద్వారా అస్సాం సంస్కృతి వైభవం ప్రతిబింబించింది. ఇక లయబద్ధమైన జానపద నృత్యం తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన సంప్రదాయ జానపద కళారూపం ఒయ్యాలట్టం భక్తులను ఆకట్టుకుంది. డప్పు, తాళాల లయకు అనుగుణంగా కళాకారులు బృందంగా ప్రదర్శించిన నృత్యం, రంగురంగుల రుమాళ్లతో చేసిన లయబద్ధమైన విన్యాసాలు చూపరులను అలరించాయి. వారణాసి కళాకారుల శ్రీమద్రామాయణ రూపకం మరింతగా ఆకట్టుకుంది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శన భక్తులను భక్తిభావంలో ముంచెత్తింది. రామాయణంలోని ఘట్టాలను నృత్య, సంగీత, అభినయ రూపాల్లో ప్రదర్శించి శ్రీరాముని మహిమను చాటిచెప్పారు. వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన కోలాటాలు, డప్పు, డ్రమ్ము విన్యాసాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్దశేష వాహనసేవ సందర్భంగా తిరుమలలో మార్మోగిన భిన్న రాష్ట్రాల జానపద సంగీతం, నృత్యాలు భారతీయ సంస్కృతిలోనిభిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సందేశాన్ని చాటిచెప్పాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని కళా ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భారతీయ కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించే అరుదైన అవకాశం కల్పిస్తున్నాయి.






