Reading Time: 2 minutes

గణపతి నవరాత్రి ఉత్సవాలు.. నవ వినాయకుల నామాలు.. వాటి అర్దం ఇదే..!

Caption of Image.

గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  ఈరోజు( సెప్టెంబర్​ 15) రెండో రోజు.  ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గణపతికి అనేక నామాలున్నాయి.  ఆర్భాటంగా.. ఆర్భాటంగా చేయడం కన్నా, శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నవ నాయకుల నామాలు.. వాటి అర్దాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం. . . 

1. వాతాపి గణపతి: గాలిని పానం చేయడం అని అర్థం. అంటే ప్రాణాయామాది సాధనల వల్ల వాయువుని నియంత్రించడం. అదే వాతాపి లక్షణం. వినాయకుడు మూలాధార అధిష్టాన దేవత. కుండలినీ జాగరణ అక్కడే ప్రారంభమౌతుంది. అటువంటి యోగంలో ముఖ్యమైనది వాయువునునియంత్రించడమేనని పండితులు చెబుతున్నారు.

 ఏనుగు నీటిని లోనికి, పైకి పీల్చిన్నట్లు మూలాధారములోని కుండలినిని పైకి తీసుకువెళ్తేనే సిద్ధి. కనుక ప్రాణవాయువును  నియంత్రించి ఆ ఊర్ధ్వ దిశలో పయనింపచేసే చైతన్యమే వాతాపి అలా యోగశక్తిగా ఉన్న గణపతినే వాతాపి గణపతి అంటారు.

2.  ఉచ్చిష్ట గణపతి: అక్షరములకు ప్రభువు ఓంకారం. గణపతి ఓంకార స్వరూపుడు. అక్షరములు అన్ని వెలువడేది నోటినుండే. నోటి నుండి వచ్చినది ఉచ్చిష్టం. కనక అక్షరపతే ఉచ్చిష్ట గణపతి.

3. మహాగణపతి/వరసిద్ధి వినాయకుడు: మహా అనేది పరబ్రహ్మ వాచకము. గణపతి సర్వదేవతాత్మకడు. 11 చేతుల(10 చేతులు,1తొండం) తో వుంటాడు. ఆయా చేతులలో వివిధ దేవత సంకేతాలుగా, వారి వారి ఆయుధాలను ధరిస్తాడు.

  • ఒక చేతిలో చక్రం-పద్మం–విష్ణులక్ష్మీ తత్వం.
  • ఒక చేతిలో త్రిశూలం-పాశం–శివ పార్వతి తత్వం.
  • మిగతా చేతుల్లో చెఱుకువిల్లు,నల్లకలువ- మన్మధుడు, రతీదేవి తత్వం,
  • వరికంకి, గద- భూదేవి వరాహస్వామి తత్వం. 
  • బీజాపూరం(దానిమ్మ పండు), ఏకదంతం — పుష్టి, పుష్టి పతి తత్వం.
  • ఇక తొండంలో రత్న ఖచిత కలశం- మోక్షానికి సంకేతం.

4. లక్ష్మీ గణపతి: ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం! అదే లక్ష్మీ అంటే. (గాయకుడికి- పాడగలడమే శక్తి)
గణపతి యొక్కశక్తి యే లక్ష్మీ  అంటే.( విష్ణుపత్ని లక్ష్మి అని  ఇక్కడ కాదని గ్రహించాలి.)

5. నాట్య గణపతి:  ఆనందంగా ఉన్నప్పుడే నాట్యం చేస్తారు.ఆనంద గణపతే  నాట్య గణపతి అన్నా తాండవ గణపతిఅన్నా కూడా. కాలం లయాత్మకం, ఊపిరీ లయాత్మకం.. అలా లయాత్మకంగా గమనం చేసే చైతన్యమే నాట్య గణపతి.

6. హేరంబ గణపతి: శుభమైన శబ్ద స్వరూపుడు అంటే ఓంకార స్వరూపుడు.హే=దీనులు, రంభ=పాలించువాడు దీనులను పాలించువాడు.

7. వినాయకుడు: విగతనాయకుడే వినాయకుడు . అంటే ఆయనకు పై ఇక వేరే  నాయకుడు లేరు. వినయమును ఇచ్చువాడు  వినాయకుడు.

8. మూషిక వాహనుడు: గుండె గుహలోని జీవుడనే ఎలుక.. ప్రపంచం చుట్టూ తిరిగి, విషయవాంఛలన్నీ ఆ హృదయ గృహలో అనుభవిస్తూ ఉంటాడు. ఆ జీవాత్మని అధిష్టించిన పరమాత్మ మూషిక వాహనుడు.నోరు అనే కలుగులో తిరిగే నాలుకే ఎలుక. దాన్ని అధిష్టించి వచ్చే అక్షరపతే గణపతి- మూషిక వాహనుడు.

9.  గణపతి: మనుషులు,  ఇంద్రియములు, పంచప్రాణాలు. ఇలా ఏమి చూసినా గణములే. ఆ గణములన్నిటికీ పతియే – గణపతి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.