Reading Time: < 1 minute
Nani The Paradise Movie A Certificate Press Meet

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించి చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అయితే దీనికి ‘ఏ’ (A) సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందని తన గట్ ఫీలింగ్ అని నాని తెలిపారు. ఈ రకమైన సర్టిఫికేట్ రావడం వల్ల హింసను ఇష్టపడని కుటుంబ ప్రేక్షకులు, పిల్లలను కొంతవరకు కోల్పోతామని ఆయన నిజాయితీగా అంగీకరించారు.

ఒక నటుడిగా ప్రతీ జోనర్ అందరినీ ఒకేలా ఆకట్టుకోలేదని, అన్ని రకాల జోనర్లను అన్వేషించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని పేర్కొన్నారు. చిత్రంలో ఉండే తీవ్రత, పర్ఫార్మెన్స్ కేవలం ఈ తరహా విధానంలోనే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు.

ఈ చిత్రంలోని హింస ‘హిట్ 3’ తరహాలో కాకుండా.. సాధారణ కమర్షియల్ సినిమాల లాగే ప్రధాన స్రవంతిలో ఉంటుందని, కాకపోతే దీనిలోని ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందని వివరించారు. తన కుమారుడు ఈ సినిమా చూడవచ్చా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడే కాకుండా, తను తగిన వయసుకు వచ్చి దానికి సిద్ధమయ్యానని భావించినప్పుడే చూడాలని బదులిచ్చినట్లు తెలిపారు.

మొత్తంగా ఈ చిత్రం పెద్దలకు సరికొత్త, ఆకట్టుకునే అనుభవాన్ని పంచుతుందని.. పిల్లలు మాత్రం దీనిని చూసేందుకు మరికొంత కాలం వేచి చూడాలని స్పష్టం చేశారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే.