Reading Time: 2 minutes

సేమ్ ఫుడ్ సేమ్ హోటల్.. స్విగ్గీలో ఆర్డర్ చేస్తే రూ.206 ఎక్కువ: హైదరాబాదీ షాక్

Caption of Image.

ఇంట్లో నుంచే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడం ఈరోజుల్లో చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. తినాలని క్రేవింగ్ రాగానే వెంటనే ఫుడ్ డెలివరీ యాప్స్ ఓపెన్ చేసి నచ్చిన ఫుడ్ నేరుగా తాము ఉన్నచోటకే తెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా బిజీ షెడ్యూల్స్ ఉన్నవారికి ఫుడ్ డెలివరీ యాప్‌లు ఎంతో సౌకర్యంగా ఉంటున్నాయి. అయితే నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి తినడానికి, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి మధ్య ధరలో భారీ వ్యత్యాసం ఉంటోందనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన ఈ అంశాన్ని మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చింది.

idlebrainjeevi అనే ఎక్స్ యూజర్ హైదరాబాద్‌లోని ఫేమస్ ‘పంచకట్టు దోశ’ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, అదే ఫుడ్‌ను స్విగ్గీలో ఆన్‌లైన్ ఆర్డర్ చేసినప్పుడు ఉన్న ధరల వ్యత్యాసాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఆ అవుట్‌లెట్‌లో నేరుగా తాను వెళ్లి తిన్నప్పుడు బిల్లు చాలా తక్కువగా ఉండగా.. ఆన్‌లైన్ యాప్‌లో అదే ఐటమ్స్‌కు రెట్టింపు ధర ఉండటం చూసి షాక్ అయ్యారు. 

రెస్టారెంట్ బిల్లు ప్రకారం జీఎస్‌టీకి ముందు మూడు ఐటమ్స్ ధర కేవలం రూ. 219గా ఉంది. ఇందులో నెయ్యి కారం ఉల్లి దోశ రూ.104, నెయ్యి పొంగల్ రూ.85, ఫిల్టర్ కాఫీ రూ.28గా ఉన్నాయి. పన్నులు కలుపుకొని మొత్తం బిల్లు రూ.230 అయింది. కానీ ఇవే ఐటమ్స్ సదరు వ్యక్తి స్విగ్గీ యాప్‌లో ఆర్డర్ చేసేందుకు చూస్తే దోశ రూ.149, పొంగల్ రూ.115, స్పెషల్ ఫిల్టర్ కాఫీ రూ.120గా లిస్ట్ అవ్వటం చూసి అవాక్కయ్యాడు. ఎలాంటి కూపన్లు, డిస్కౌంట్లు వర్తించకుండా కార్ట్ టోటల్ ఏకంగా రూ.436కి చేరింది. అంటే నేరుగా పోయి తినకుండా అవే ఫుడ్ ఆర్డర్ చేస్తే స్విగ్గీలో రూ.206 అదనంగా పడిందని చెప్పాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి. రెస్టారెంట్‌కు వెళ్లే ప్రయాణ ఖర్చులు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫుడ్ తెప్పించుకుంటున్నందుకు ఆ మాత్రం అదనపు ఛార్జీలు ఉండటంలో తప్పులేదని కొందరు అభిప్రాయపడ్డారు. డెలివరీ బాయ్స్, ప్లాట్‌ఫారమ్ నిర్వహణ ఖర్చులు, రెస్టారెంట్లు చెల్లించే 25-30 శాతం కమిషన్ల కారణంగానే ఈ రేట్ల వ్యత్యాసం ఉంటుందని మరికొందరు పేర్కొన్నారు.

ఆన్‌లైన్ ఆర్డర్‌ల వల్ల ఒక్కోసారి ఫుడ్ లేట్‌గా రావడం, చల్లబడి రుచి కోల్పోవడం జరుగుతోందని కొందరు యూజర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తే.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయకుండా నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లొచ్చని ఇంకొందరు సూచించారు. ఏది ఏమైనప్పటికీ సౌకర్యం పేరిట కస్టమర్లపై పడుతున్న అదనపు ఆర్థిక భారం గురించి హైదరాబాదీ పోస్టు ఆలోచింపజేస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.