Reading Time: 3 minutes
Saudi Houthis Makkah Drone Attack Pakistan Mecca Defence Pact

ఇటీవల మక్కా వేదికగా పాకిస్థాన్-సౌదీ-టర్కీ రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశంపై దాడి చేస్తే.. శత్రువుపై మూడు దేశాలు దాడి చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. అలాంటిది. గత కొద్దిరోజులుగా సౌదీపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు భీకర దాడులు చేస్తున్నాయి. తాజాగా ఈ దాడులు మక్కాకు కూడా చేరాయి. ఈ దాడులను ప్రపంచ దేశాలను ఖండిస్తున్నాయి. తాజాగా భారతదేశం కూడా ఖండించింది. ఆశ్చర్యంగా ఒప్పందంలో ఉన్న పాకిస్థాన్ చప్పుడు చేయడం లేదు. హౌతీలపై దాడికి దిగాల్సిన పాకిస్థాన్ మౌనం వహిస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థను సాయం కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా మద్దతుతో ఈ సాయం కోరినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ మధ్య ఇటీవల కుదిరిన ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హౌతీలపై పోరులో ఇస్లామాబాద్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు వెనుకంజ వేస్తుండటంతో.. రియాద్ ఇజ్రాయెల్ నుంచి నిఘా సహాయం కోరినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. హౌతీల కదలికలు, సైనిక మోహరింపులపై విస్తృత సమాచారం పొందేందుకు ఇజ్రాయెల్ నుంచి ఇంటెలిజెన్స్ సహాయం అందించాలని రియాద్ కోరినట్లు ‘ది జెరూసలెం పోస్ట్’ను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. సౌదీ అరేబియా–ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికీ అధికారిక దౌత్య సంబంధాలు లేవు. పాలస్తీనా దేశ ఏర్పాటుకు స్పష్టమైన, తిరుగులేని మార్గం ఏర్పడితేనే ఇజ్రాయెల్‌తో సాధారణీకరణపై ముందుకు వెళ్తామని సౌదీ చెబుతోంది. అయినప్పటికీ హౌతీల సైనిక సామర్థ్యం, భవిష్యత్ దాడులపై అవగాహన పెంచుకునేందుకు ఇజ్రాయెల్ నిఘా సహాయం కోరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

పాకిస్థాన్ ఎందుకు వెనక్కి?

సౌదీ, పాకిస్థాన్, టర్కీ మధ్య ఇటీవల కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందానికి హౌతీలతో జరుగుతున్న యుద్ధం తొలి పెద్ద పరీక్షగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. మిగతా దేశాలపై కూడా దాడిగా పరిగణించి స్పందించాల్సి ఉంటుంది. అలాంటిది హౌతీలు దాడులు చేస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం జోక్యం పుచ్చుకోవడం లేదు. ఇక యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై సౌదీ చేపట్టిన సైనిక చర్యల్లో కూడా పాకిస్థాన్ ప్రత్యక్షంగా చేరలేదు. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదని.. ఆపరేషనల్ విధానం ఇంకా ఖరారు కావాల్సి ఉందని ఇస్లామాబాద్ పేర్కొన్నట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. అందుకోసమే సౌదీకి సాయం చేయడం లేదని కథనాలు వస్తున్నాయి. అయితే సౌదీపై దాడి జరిగితే ఒప్పందం ప్రకారం స్పందించాల్సి ఉంటుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. రియాద్ తమను సంప్రదించిందో లేదో తనకు తెలియదని చెప్పిన ఆయన.. ‘‘ఒప్పందం ప్రకారం మేము సహాయం చేయాల్సి ఉంటుంది లేదా స్పందించాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

మక్కాపై ఖండన

మక్కా సమీపంలో డ్రోన్ ముప్పు ఏర్పడిన ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. పవిత్ర మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు చెబుతున్న డ్రోన్ దాడి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సౌదీ రాయల్ సాయుధ దళాలు అప్రమత్తత, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో డ్రోన్‌ను అడ్డుకున్నందుకు అభినందనలు తెలిపారు. సౌదీ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతతో పాటు మక్కా, మదీనా పవిత్రతను కాపాడటంలో పాకిస్థాన్ సౌదీతో భుజం భుజం కలిపి నిలుస్తుందని చెప్పారు. అయితే సౌదీకి ప్రత్యక్ష సైనిక సహాయం అందించడంపై షెహ్‌బాజ్ షరీఫ్ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

పాకిస్థాన్‌కు ఇరువైపులా ఒత్తిడి

హౌతీ ముప్పు కారణంగా పాకిస్థాన్‌కు వ్యూహాత్మకంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ఒకవైపు గల్ఫ్ దేశాలతో రక్షణ, పెట్టుబడుల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఇస్లామాబాద్‌కు ఉంది. మరోవైపు ఇరాన్‌తో సంబంధాలను పూర్తిగా దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ దేశాలతో రక్షణ ఒప్పందాలు, పెట్టుబడులు కీలకంగా మారాయి. అదే సమయంలో చమురు, గ్యాస్ సరఫరాల కోసం పాకిస్థాన్ హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాలపై ఆధారపడుతోంది. ఈ మార్గాలను ఇరాన్, హౌతీలు అంతరాయం కలిగించే సామర్థ్యం కలిగి ఉండటంతో ఇస్లామాబాద్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

ఎర్ర సముద్రంలోనూ ఉద్రిక్తత

జూలై నుంచి హౌతీలు సౌదీ సైనిక, ఇంధన మౌలిక వసతులపై దాడులు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను, వ్యూహాత్మకమైన బాబ్-ఎల్-మందెబ్ జలసంధి పరిసరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మక్కాపై డ్రోన్ ప్రయోగించినట్లు సౌదీ చేసిన ఆరోపణలను హౌతీలు మాత్రం తీవ్రంగా ఖండించారు. అవి ‘‘కల్పిత ఆరోపణలు, అబద్ధాలు’’ అని పేర్కొన్నారు. తమ దాడులు పవిత్ర స్థలాలపై కాదని, సౌదీ చమురు సంస్థలు, సైనిక స్థావరాలపైనే తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ తెలిపారు.

మక్కా సమీపంలో డ్రోన్‌ను కూల్చివేత

సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం మక్కాకు దక్షిణంగా ఒక డ్రోన్‌ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించి ధ్వంసం చేశాయి. పవిత్ర నగరానికి సంబంధించిన నిషేధిత గగనతలంలోకి ప్రవేశించేలోపే డ్రోన్‌ను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను సంకీర్ణ దళాల ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ ‘‘శత్రు, ఉగ్ర చర్య’’గా అభివర్ణించారు. రెండు పవిత్ర మసీదులు, యాత్రికుల భద్రత తమకు ‘రెడ్ లైన్’ అని స్పష్టం చేశారు. 2017లో మక్కా వైపు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఇది మక్కాను లక్ష్యంగా చేసుకున్న రెండో ప్రయత్నమని తెలిపారు.

ఇదిలా ఉంటే.. సౌదీ సంకీర్ణ దళాలు యెమెన్‌లోని పలు ప్రాంతాలపై వారంలో 450కుపైగా వైమానిక దాడులు చేశాయని యాహ్యా సరీ ఆరోపించారు. ఖమీస్ ముషైత్, తాయిఫ్ స్థావరాల నుంచి F-15, టైఫూన్ యుద్ధ విమానాలు దాడుల్లో పాల్గొన్నాయని, ఈ దాడుల్లో పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మారిబ్‌పైగా ప్రయాణిస్తున్న సౌదీ F-15 యుద్ధ విమానాన్ని స్థానికంగా తయారు చేసిన భూ-గగన క్షిపణితో కూల్చివేసినట్లు కూడా హౌతీలు ప్రకటించారు. ఆ విమానం శకలాల కోసం వచ్చిన సౌదీ F-15, టైఫూన్ విమానాల రెండు బృందాలను తమ రక్షణ చర్యలతో వెనక్కి వెళ్లేలా చేశామని సరీ తెలిపారు.