Reading Time: 2 minutes
Andhra Pradesh: చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

విశాఖపట్నం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద బుధవారం తెల్లవారుజామున వింత ఘటన కలకలం రేపింది. పార్క్ మెయిన్ గేటు ఎదుట ఉన్న ఓ చెట్టు కింద భారీగా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా దర్శనమివ్వడంతో స్థానికులు, మార్నింగ్ వాకర్స్ తీవ్ర విస్మయానికి గురయ్యారు. ఒకేచోట వేర్వేరు రకాల నోట్ల ముక్కలు పడి ఉండటంతో ఎవరో కావాలనే ఇలా పడేశారా లేక దీని వెనుక ఏదైనా నేరపూరిత కోణం దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉదయాన్నే వాకింగ్‌కు వచ్చిన స్థానికులు చెట్టు కింద అనుమానాస్పదంగా పడి ఉన్న నోట్ల కుప్పను గుర్తించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా రూ. 500, రూ. 100, రూ. 50, రూ. 20, రూ. 10 నోట్లు అన్నీ ముక్కలు ముక్కలుగా చిరిగిపోయి, చెదలు పట్టిన స్థితిలో కనిపించాయి. కొన్ని నోట్ల నంబర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షణాల్లో ఈ దృశ్యాలు ఫోన్లలో రికార్డయి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది.

రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తులో కీలక క్లూ

సమాచారం అందుకున్న వెంటనే విశాఖ టూటౌన్ క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్టు కింద పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్ల ముక్కలతో పాటు అక్కడే లభ్యమైన పాన్ కార్డు, ఎల్ఐసీ రసీదులను స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, అక్కడ దొరికిన పాన్ కార్డు ఆధారంగా చిరునామాను గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు.

అసలు మిస్టరీ వీడిందిలా..

పాన్ కార్డు వివరాల ఆధారంగా తాడివీధికి చెందిన సూర్యారావు అనే వ్యక్తిని గుర్తించిన పోలీసులు, ఆయనను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విచారణలో సూర్యారావు చెప్పిన నిజాలు విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. కిరాణా షాపులకు సరుకులు సరఫరా చేసే వ్యాపారం చేసే సూర్యారావు, తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఇంట్లోనే దాచుకున్నాడు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొంతకాలానికి ఆ నోట్లన్నింటికీ చెదలు పట్టాయి. దాచుకున్న డబ్బులన్నీ చెదలు పట్టి ముక్కలైన విషయాన్ని గుర్తించిన సూర్యారావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇంట్లో తెలిస్తే కుటుంబ సభ్యులు మందలిస్తారనే భయంతో ఎవరికీ తెలియకుండా మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆ నోట్ల ముక్కలను కవర్‌లో తెచ్చి సెంట్రల్ పార్క్ చెట్టు కింద పారేశాడు. ఆ హడావిడిలో కవర్‌తో పాటే తన పాన్ కార్డు, ఎల్ఐసీ రసీదులు కూడా అక్కడే పడిపోయిన సంగతిని అతడు గమనించలేకపోయాడు.

ఆ చెదపట్టిన నోట్ల మొత్తం విలువ దాదాపు రూ.3,000 వరకు ఉంటుందని సూర్యారావు పోలీసుల ఎదుట వెల్లడించాడు. దీంతో ఈ ఘటన వెనుక ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని నిర్ధారించుకున్న టూటౌన్ క్రైమ్ పోలీసులు, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం సూర్యారావుకు చెందిన పాన్ కార్డు, ఎల్ఐసీ రసీదులను ఆయనకే అప్పగించి హెచ్చరించి పంపించడంతో ఈ కరెన్సీ నోట్ల మిస్టరీ సుఖాంతమైంది.