Reading Time: 2 minutes

కిరోసిన్.. నీటి ఆవిరితో పనిచేసే హైబ్రిడ్ స్టౌ: మధ్యప్రదేశ్ కుర్రాడి ప్రయోగం సక్సెస్

Caption of Image.

సాధారణంగా టీనేజ్ పిల్లలు స్కూల్ చదువులు, సైన్స్ ప్రాజెక్టులతో బిజీగా ఉండే వయసులో మధ్యప్రదేశ్‌లోని దేవ్‌సార్‌కు చెందిన వ్యాస్జీ మిశ్రా అనే బాలుడు 16 ఏళ్ల వయస్సులో వినూత్న ప్రయోగం చేశాడు. 11వ తరగతి చదువుతున్న సమయంలో కిరోసిన్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో నీటిని ఆవిరిగా మార్చి ఇంధనంగా మలచే ఒక హైబ్రిడ్ స్టౌను తయారు చేశాడు. సాధారణంగా నీటితో మాత్రమే నడిచే స్టౌ అనే అపోహ ఉన్నప్పటికీ.. ఇది కిరోసిన్ అలాగే నీటి ఆవిరిని కలిపి ఉపయోగించి పనిచేసే ఒక ఫ్యూయల్ ఎఫీషియెంట్ స్టౌ.

ఈ ఆలోచన ఎలా వచ్చింది?
వ్యాస్జీ మిశ్రాకు చిన్నతనం నుంచే సైన్స్‌పై విపరీతమైన ఆసక్తి ఉండేది. అంతకుముందు 2000 సంవత్సరంలో ఆయన చేసిన డ్రిప్ ఇరిగేషన్ మోడల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో 1st ప్రైజ్ గెలుచుకుంది. అయితే ఈ హైబ్రిడ్ స్టౌ ఆలోచన ఆతని అన్నయ్య పవన్జీ మిశ్రాకు సంబంధించిన ఒక పాత ప్రయత్నం నుంచి పుట్టింది. 2001-02లో అన్న చేసిన ప్రయోగం అసంపూర్తిగా ఆగిపోవడంతో.. 2002-03లో పాఠశాల సైన్స్ ఎగ్జిబిషన్ కోసం అన్నదమ్ములు కలిసి దీనిపై మళ్లీ పని చేయడం స్టార్ట్ చేశారు. జాతీయ ఆవిష్కరణ ఫౌండేషన్ సహకారంతో సుమారు 6 నెలల పాటు శ్రమించి ఈ ప్రొటోటైప్‌ను తయారు చేశారు.

ఈ హైబ్రిడ్ స్టౌ ఎలా పనిచేస్తుంది?
ఈ స్టౌలో రెండు వేర్వేరు ట్యాంకులు ఉంటాయి. ఒకటి కిరోసిన్ కోసం, మరొకటి నీటి కోసం. ఇవి రెండూ ఒకే బర్నర్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. మొదట కిరోసిన్‌తో బర్నర్‌ను వేడి చేశాక, కిరోసిన్ సరఫరా తగ్గించి నీటి వాల్వ్ ఓపెన్ చేస్తారు. వేడెక్కిన నీరు ఆవిరిగా మారి మంటను కొనసాగిస్తుంది. మంట తగ్గిపోయినప్పుడు మళ్లీ కిరోసిన్‌కు మళ్లేలా 3 ప్రత్యేక రెగ్యులేటర్ల సిస్టమ్‌ను దీనికి అమర్చారు. దీనివల్ల కిరోసిన్ వాడకం సుమారు 20 శాతం వరకు తగ్గుతుందని ఐఐటీ గౌహతి పరీక్షల్లో తేలింది.

దీనిని ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది?
పాత కాలంలో ఇళ్లలో కిరోసిన్ వాడకం ఎక్కువగా ఉండటం కట్టెలు, కిరోసిన్ వల్ల వచ్చే పొగ, ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ స్టౌను రూపకల్పన చేశారు. ఆర్థికంగా సాధారణ కుటుంబానికి చెందిన వ్యాస్జీకి ఆయన తండ్రి, అన్నయ్య ఆర్థికంగా, సాంకేతికంగా పూర్తి మద్దతునిచ్చారు. ఉన్న పరిమిత వనరులతోనే చిన్న సమస్యకు పెద్ద పరిష్కారాన్ని వెతకవచ్చని ఈ బాలుడు నిరూపించాడు.

ALSO READ : ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్

ఈ అద్భుతమైన ఆవిష్కరణకు 2003లో సైన్స్ ప్రదర్శనలో మొదటి బహుమతి లభించింది. ఆ తర్వాత నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ మైక్రో వెంచర్ ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం, మార్కెట్ రీసెర్చ్ సపోర్ట్ అందించింది. నీటితో పూర్తిగా నడిచే అద్భుతం కాకపోయినా.. ఒక సామాన్య విద్యార్థి తన ఆలోచనతో చేసిన ఈ చిన్న ప్రయత్నం అప్పట్లో దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.

©️ VIL Media Pvt Ltd.