Reading Time: < 1 minute
Disha Salian Case Aaditya Thackeray Says I Never Met Her Denies Allegations

Disha Salian Case: దిశా సాలియన్ మృతి కేసుపై శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. దిశా సాలియన్ ఎవరో తనకు తెలియనది, ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంత మంది తన పేరును ఈ కేసులోకి లాగుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. దిశా సాలియన్ విషాదకర మరణంతో తన పేరును ముడిపెట్టడం తన పరువు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారమని పేర్కొన్నారు. టీవీ చర్చలు, మీడియా ట్రయల్స్ వాస్తవాలను మార్చలేవని చెప్పారు. ఈ కేసులో అధికారిక దర్యాప్తు కొనసాగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగకూడదని పేర్కొన్నారు.

సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ 2020 జూన్ 9న ముంబైలోని మలాద్ లోని 12వ అంతస్తు నుంచి పడిపోయి మరణించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది. ఆమె గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మేనేజర్‌గా పనిచేశారు. ప్రాథమిక దర్యాప్తులో ముంబై పోలీసులు ఆమె మరణాన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. 2023లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఆమె మరణంలో నేరపూరిత కుట్రకు ఆధారాలు లేవని నిర్ధారించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.

దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఆదిత్య ఠాక్రే పేరుతో పాటు మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్‌లో అత్యాచారం, హత్య, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.