
సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): డిఫెండింగ్ చాంపియన్ ఇండియా జట్లు.. బుధవారం నుంచి మొదలుకానున్న చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మెన్స్ టీమ్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద ప్రధాన ఆకర్షణ కానున్నారు. గత ఎడిషన్‌తో పోలిస్తే గుకేశ్ ఈసారి భిన్నమైన దశతో టోర్నీలోకి అడుగుపెడుతున్నాడు. ఏడాది కాలంగా నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న గుకేశ్.. నవంబర్‌లో స్విట్జర్లాండ్‌లో జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ముందు లయ అందుకోవాలని పట్టుదలగా ఎదురుచూస్తున్నాడు.
గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద ఫామ్ ఇండియా జట్టుకు తిరుగులేని బలంగా మారనుంది. 2024 బుడాపెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అర్జున్, విదిత్ గుజరాతీ, నీహల్ సరీన్ పెర్ఫామెన్స్ జట్టును మరింత పటిష్టం చేయనున్నాయి. అమెరియా, ఉజ్బెకిస్తాన్ నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురుకానుంది. యూఎస్ టీమ్‌లో ఫ్యాబియానో కరువాన, లెవోన్ అరోనియన్‌లాంటి లెజెండ్స్ ఉండగా, జావోఖిర్ సిందరోవ్ ఉజ్బెక్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఇండియా విమెన్స్ జట్టు కూడా డిఫెండింగ్ చాంపియన్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, వరల్డ్ కప్ విన్నర్ దివ్య దేశ్‌ముఖ్, వరల్డ్ చాంపియన్‌షిప్ చాలెంజర్ ఆర్. వైశాలిపై ఇండియా భారీ ఆశలు పెట్టుకుంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఇండియాకు.. జార్జియా, కజకిస్తాన్ నుంచి పోటీ ఉంటుంది. మరోవైపు చెస్ ఒలింపియాడ్ కోసం వెళ్లిన ఇండియా జట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సమర్‌కండ్ చేరుకున్న జట్లకు ఐదు గంటల పాటు హోటల్ గదులు కేటాయించలేదు. దాంతో ఎయిర్‌పోర్ట్ హోటల్ లాబీలోనే నిరీక్షించారు.