Reading Time: 2 minutes
Karnataka Refrigerator Blast 4 Of Family Killed 2 Injured

Belagavi Refrigerator Blast: కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లోని ఫ్రిజ్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెళగావి నగరంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతులను భారతి దామోనే (50), శారద దామోనే (45), గంగ దామోనే (25), ప్రియ దామోనే (24)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గజానన్ దామోనే (65), రోషన్ దామోనే (21) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గజానన్‌కు సుమారు 60 శాతం కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

గణేశ్ చతుర్థి ఏర్పాట్ల మధ్య ప్రమాదం

పోలీసుల వివరాల ప్రకారం.. దామోనే కుటుంబం గణేశ్ చతుర్థి వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని చావట్ గల్లీలో ఉన్న తమ ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. ప్రతిరోజూ మాదిరిగానే ఫ్రిజ్‌కు సమీపంలో ఉన్న షెడ్‌లో నిద్రించారు.

అర్ధరాత్రి సుమారు 2.15 గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే కుటుంబం నివసిస్తున్న షెడ్‌ వద్దకు చేరుకోగా.. మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించారు. స్థానికులు మంటల్లో నుంచి గజానన్, రోషన్‌లను బయటకు తీసుకువచ్చారు. అయితే మిగిలిన నలుగురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.

షెడ్ ధ్వంసం.. విలువైన వస్తువులు కాలిబూడిద

ఫ్రిజ్ పేలుడు ధాటికి కాంక్రీట్ గోడలు లేని షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని విలువైన వస్తువుల్లో ఎక్కువ భాగం మంటల్లో కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఫ్రిజ్ పేలినట్లు స్పష్టమవుతున్నప్పటికీ.. అది ఎందుకు పేలిందనే విషయాన్ని నిర్ధారించేందుకు విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించిందా? లేక మరేదైనా కారణంతో మంటలు చెలరేగాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

గణేశుడి అలంకరణ లైట్లపైనా అనుమానం

కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహానికి కొన్ని అలంకరణ లైట్లు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ లైట్ల కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో శారద.. గజానన్ భార్య కాగా, భారతి ఆయన సోదరి. గంగ, ప్రియలు గజానన్- శారద దంపతుల కుమార్తెలు. రోషన్ వారి కుమారుడు. గజానన్ వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పనిచేస్తుండగా.. కుటుంబంలోని మిగతా సభ్యులు ఇళ్లలో పనులు లేదా వాణిజ్య సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారని పోలీసులు తెలిపారు.